ఒకప్పుడు వేలు, లక్షల్లో పెట్టుబడిపెట్టి ప్రారంభించిన కంపెనీలు ప్రపంచంలోనే అత్యున్నత సంస్థలుగా ఎదిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతోంది. నిత్యం టెక్నాలజీలో వస్తోన్న మార్పులు, వివిధ దేశాల్లోని ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు, యువతలో పెంపొందుతున్న నైపుణ్యాలు, కొత్త ఆవిష్కరణలు..వంటి ఎన్నో కారణాల వల్ల గ్లోబల్ ఎకానమీ దూసుకుపోతోంది. వివిధ రంగాలు వృద్ధిపథంలోకి వెళుతున్నాయి. దాంతో ఆయా రంగాల వార్షిక ఆదాయం క్రమంగా హెచ్చవుతోంది. అందులో ప్రపంచాన్ని శాసిస్తున్న కొన్ని రంగాల గురించి తెలుసుకుందాం.
ఇంటర్నెట్ అండ్ డిజిటల్ అడ్వర్టైజింగ్
వార్షిక ఆదాయం: రూ.377 లక్షల కోట్లు.
ఇంటర్నెట్, ఇ-కామర్స్, క్లౌడ్ సేవలు, డిజిటల్ ప్రకటనలు..వంటి సర్వీసులతో ఈ ఆదాయం సమకూరుతోంది. ఈ రంగంలో గూగుల్(ఆల్ఫాబెట్), ఫేస్‌బుక్(మెటా), అమెజాన్ వంటి కంపెనీలు సేవలందిస్తున్నాయి.
ఈ-కామర్స్
వార్షిక ఆదాయం: రూ.419 లక్షల కోట్లు.
అమెజాన్, అలిబాబా, ఈబే, ఫ్లిప్‌కార్ట్..వంటి కంపెనీలు ఈ రంగంలో సేవలందిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యంత లాభదాయకమైన రంగాలలో ఇది ఒకటి.
ఆటోమొబైల్
వార్షిక ఆదాయం: రూ.226 లక్షల కోట్లు.
కార్ల తయారీ, విడిభాగాల తయారీ, సర్వీసు విభాగాల్లో ఈ రంగం వృద్ధి చెందుతోంది. టయోటా, ఫోక్స్‌వ్యాగన్, టాటా, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీసుజుకీ..వంటి కంపెనీలు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
ఫార్మాస్యూటికల్స్ అండ్ మోడ్రన్ మెడిసిన్
వార్షిక ఆదాయం: రూ.117 లక్షల కోట్లు.
ఔషధ పరిశ్రమ, మందులు, వ్యాక్సిన్‌లు, వైద్య పరికరాల అభివృద్ధి, విక్రయాలు ఈ రంగాన్ని వృద్ధిబాటలు వేస్తున్నాయి. దేశీయంగా హైదరాబాద్ వంటి నగరాలు ఫార్మా తయారీకి ప్రధాన వనరుగా మారుతున్నాయి.
స్మార్ట్‌ఫోన్‌లు, మొబైల్ టెక్నాలజీ
వార్షిక ఆదాయం: రూ.125 లక్షల కోట్లు.
ప్రస్తుతం దాదాపు అందరివద్ద స్మార్ట్‌పోన్లున్నాయి. 3జీ టెక్నాలజీ వచ్చినపుడు అందుకు తగిన ఫోన్లు వాడారు. 4జీ ప్రారంభంలో తిరిగి ఆ టెక్నాలజీకి అనువైన ఫోన్లు వినియోగించారు. ఇప్పుడు 5జీ ఫోన్లవైపు మొగ్గు చూపుతున్నారు. ఈ రంగంలో యాపిల్, సామ్‌సంగ్, మోటోరోలా..వంటి కంపెనీలు సర్వీసులిస్తున్నాయి.
విద్యుత్
వార్షిక ఆదాయం: రూ.251 లక్షల కోట్లు.
పారిశ్రామిక రంగం వృద్ధి చెందుతున్న కొద్దీ విద్యుత్ అవసరాలు పెరుగుతున్నాయి. భవిష్యత్తులో కరెంట్‌కు మరింత డిమాండ్ ఏర్పడుతుంది. సంప్రదాయంగా దీని ఉత్పత్తికి బొగ్గు వాడుతున్నారు. కానీ వాతావరణ కాలుష్యం వల్ల క్రమంగా బొగ్గు వినియోగాన్ని తగ్గిస్తున్నారు. దీనిస్థానే పునరుత్పాదక శక్తిని ప్రోత్సహిస్తున్నారు.
క్లౌడ్ కంప్యూటింగ్
వార్షిక ఆదాయం: రూ.33 లక్షల కోట్లు.
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ క్లౌడ్ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని పెంచాల్సి ఉంటుంది. అందుకోసం కంపెనీలు నిత్యం వాటి కౌడ్ సర్వీసులను అప్‌డేట్ చేస్తూంటాయి. ఈ రంగంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్ అజూర్, గూగుల్ క్లౌడ్..వంటివి సేవలందిస్తున్నాయి.
టెలికమ్యూనికేషన్స్
వార్షిక ఆదాయం: రూ.142 లక్షల కోట్లు.
మొబైల్ నెట్‌వర్క్‌లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, బ్రాడ్‌బ్యాండ్ మౌలిక సదుపాయాలు ఈ రంగం పరిధిలోకి వస్తాయి. టెలికమ్యూనికేషన్ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా గణనీయమైన ఆదాయాన్ని ఆర్జిస్తోంది.
పర్సనల్ కంప్యూటింగ్
వార్షిక ఆదాయం: రూ.41 లక్షల కోట్లు.
ఇంట్లో ఉపయోగించే కంపూటర్లు, వాటి సర్వీసులు, ల్యాప్‌టాప్‌లు, అనుబంధ సాఫ్ట్‌వేర్ విక్రయాలు పర్సనల్ కంప్యూటింగ్ మార్కెట్ కిందకు వస్తాయి. ఈ రంగంలో యాపిల్, మైక్రోసాఫ్ట్, లెనోవో, హెచ్‌పీ..వంటి కంపెనీలు దూసుకుపోతున్నాయి.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు
వార్షిక ఆదాయం: రూ.12 లక్షల కోట్లు.
ఈ రంగంలో పేస్‌బుక్(మెటా), ట్విటర్, టిక్‌టాక్..వంటి కంపెనీలు సర్వీసులు అందిస్తున్నాయి. ఈ ప్లాట్‌ఫామ్‌ల్లో ప్రకటనలు, డేటా మానిటైజేషన్ ద్వారా ఆదాయం వస్తోంది.
ఇదీ చదవండి: ఏడాదిలోనే రూ.2 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం
స్ట్రీమింగ్ సేవలు
వార్షిక ఆదాయం: రూ.8.3 లక్షల కోట్లు.
ఈ విభాగంలో నెట్‌ఫ్లిక్స్, డిస్నీ హాట్‌స్టార్, స్పాటిఫై, ఆహా, అమెజాన్, జియో సినిమా వంటి స్ట్రీమింగ్ కంపెనీలు సర్వీసులు అందిస్తున్నాయి. సబ్‌స్క్రిప్షన్‌లు, ప్రకటనల ద్వారా ఇవి ఆదాయం పొందుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment