న్యూఢిల్లీ: భారత్‌ను అంతర్జాతీయ తయారీ కేంద్రంగా, వనరుల సమీకరణ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు, కావాల్సిన విధానాలను రూపొందించాలని దేశీ పరిశ్రమను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. అభివృద్ధి చెందిన దేశాలు మాంద్యం రిస్క్‌లను ఎదుర్కొంటున్న వేళ అక్కడ వ్యాపారాలు ఎలా నడుస్తున్నాయో అధ్యయనం చేయాలని సూచించారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు కేంద్రం ఎన్నో వసతులతోపాటు, నిబంధనలను కూడా సవరించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ‘‘పాశ్చాత్య, అభివృద్ధి చెందిన దేశాల్లో దీర్ఘకాలంగా కొనసాగుతున్న మాంద్యం నేపథ్యంలో మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి.
అక్కడి తయారీ దారులను భారత్‌కు తీసుకొచ్చేందుకు కావాల్సిన వ్యూహాలపై పనిచేసేందుకు ఇదే సరైన సమయం. ఆయా కంపెనీల ప్రధాన కార్యాలయాలు అక్కడే ఉన్నా కానీ.. ఎన్నో ఉత్పత్తులు, విడిభాగాలను ఇక్కడి నుంచి సమీకరించుకోవడం వాటికి సైతం సాయంగా ఉంటుంది. కొంతవరకు తయారీని ఇక్కడ చేయడం అవసరం’’అని మంత్రి శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఫిక్కీ 95వ వార్షిక సమావేశంలో భాగంగా పరిశ్రమకు సూచించారు. దీర్ఘకాలం కొనసాగే మాంద్యం వల్ల యూరప్‌పై ప్రభావం పడుతుందన్న మంత్రి.. భారత్‌పై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చన్నారు. యూరప్ తదితర పాశ్చాత్య ప్రపంచంలో పనిచేసే కంపెనీలకు, భారత్ ప్రత్యామ్నాయ కేంద్రం కాగలదన్నారు.
ఇప్పుడు ప్లస్ 2..: భారత్ చైనా ప్లస్1గా పనిచేస్తోందని, యూరప్ ప్లస్ వన్‌గా కూడా మారుతోందని మంత్రి సీతారామన్ అన్నారు. ‘‘కనుక ప్లస్ వన్ ఇప్పుడు ప్లస్ 2గా మారింది. ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో వసతులు కల్పించింది. నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చింది. భారత్‌కు తయారీ వసతులను తరలించాలనుకుంటున్న కంపెనీలతో సంప్రదింపులు చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. కొందరు భారత్ తయారీపై దృష్టి సారించొద్దని, కేవలం సేవలపైనే దృష్టి పెట్టాలన్న సూచనలు చేస్తున్నారు. కానీ ఇదీ కుదరదు.
తయారీపై, కొత్త విభాగాలపై తప్పకుండా దృష్టి పెట్టాల్సిందే’’అని మంత్రి స్పష్టత ఇచ్చారు. చైనా తయారీ నమూనాను గుడ్డిగా అనుసరించకుండా, భారత్ సేవలపైనే దృష్టి కొనసాగించాలంటూ పలువురు ఆర్థికవేత్తలు, నిపుణులు సూచిస్తున్న క్రమంలో మంత్రి దీనిపై మాట్లాడారు. ఇప్పటికే మన దేశ జీడీపీలో ఐటీ ఆధారిత సేవల రంగం వాటా 60 శాతంగా ఉన్నట్టు మంత్రి చెప్పారు. వాతావరణ మార్పులు తమపై ఏవిధమైన ప్రభావం చూపిస్తున్నాయన్నది పరిశ్రమ ప్రభుత్వానికి తెలియజేయాలని సూచించారు. తమపై దీనికి సంబంధించి వ్యయాల భారాన్ని ఎలా తగ్గించాలో కూడా సూచనలు ఇవ్వాలని కోరారు.
వృద్ధి ఆధారిత బడ్జెట్
వచ్చే బడ్జెట్‌లోనూ (2023–24) పూర్వపు బడ్జెట్ స్ఫూర్తి కొనసాగుతుందని, వృద్ధికి మద్దతుగా ఉంటుందని మంత్రి సీతారామన్ సంకేతం ఇచ్చారు. భారత్‌ను వచ్చే 25 ఏళ్ల కాలానికి ముందుకు నడిపించే పునాదిగా ఉంటుందని మంత్రి చెప్పారు. ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరానికి భారత్ జీడీపీ వృద్ధి అంచనాలను ఆర్‌బీఐ సహా అంతర్జాతీయ ఏజెన్సీలు తగ్గిస్తున్న తరుణంలో.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి మంత్రి సీతారామన్ సమర్పించే బడ్జెట్ కీలకంగా మారింది. వచ్చే ఫిబ్రవరి 1న పార్లమెంట్‌కు మంత్రి బడ్జెట్‌ను
సమర్పించనున్నారు.
2024–25లో 5 ట్రిలియన్ డాలర్లకు: నితిన్ గడ్కరీ
భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధిని సాధిస్తోందని, 2024–25 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల (రూ.410 లక్షల కోట్లు) స్థాయికి చేరుకోవాలన్న లక్ష్యాన్ని సాధిస్తామని కేంద్ర రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఫిక్కీ నిర్వహించిన వార్షిక కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడారు. ప్రభుత్వం సుస్థిరాభివృద్ధి కోసం వృద్ధిని, ఉపాధిని పెంచాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment