ఐసీఎస్‌ఐ 55వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఆర్థిక మంత్రి సీతారామన్
న్యూఢిల్లీ: కార్పొరేట్ గవర్నెన్స్ విషయంలో భారత్ రోల్ మోడల్‌గా ఎదిగేందుకు కంపెనీ సెక్రటరీలు కృషి చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు. అలాగే, వ్యాపారాలు, పెట్టుబడులను ప్రోత్సహించే చట్టాలు అమలయ్యేలా చూడటంలో తమ వంతు తోడ్పాటు అందించాలని పేర్కొన్నారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్‌ఐ) 55వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విజ్ఞప్తి చేశారు.
ప్రపంచానికి సారథ్యం వహించగలిగే దేశంగా భారత్ ముందుకు పురోగమిస్తోందని ముర్ము పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దేశీయంగా వృత్తి నిపుణులు తగిన అర్హత కలిగినవారై ఉండటంతో పాటు సాహసోపేతంగా, సృజనాత్మకంగా కూడా వ్యవహరించాలని ఆమె చెప్పారు. కంపెనీ సెక్రటరీల సంకల్పంపైనే దేశ కార్పొరేట్ గవర్నెన్స్ భవిష్యత్ ఆధారపడి ఉందన్నారు.
కార్పొరేట్ గవర్నెన్స్‌కు పునరంకితం కావాలి
మెరుగైన కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాల పాటింపునకు కంపెనీ సెక్రటరీలు పునరంకితం కావాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ కార్యక్రమంలో సూచించారు. ఐసీఎస్‌ఐ నెలకొల్పిన ఉత్తమ ప్రమాణాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని కితాబిచ్చారు. అగ్నివీర్, డిఫెన్స్ సిబ్బంది, అమరవీరుల కుటుంబాలకు చెందిన వారు కంపెనీ సెక్రటరీ కోర్సులో చేరితే రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి మినహాయింపునివ్వాలని ఐసీఎస్‌ఐ నిర్ణయం తీసుకోవడం, అమరవీరుల కుమార్తెల విద్యాభ్యాసం కోసం రూ. 11 లక్షల విరాళమివ్వడం ప్రశంసనీయమని ఆమె పేర్కొన్నారు.
వ్యాపార నిర్వహణను సులభతరం చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని మంత్రి చెప్పారు. ఈ నేపథ్యంలో భారత్‌లోకి గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో 230 బిలియన్ డాలర్ల పైచిలుకు పెట్టుబడులు వచ్చినట్లు పేర్కొన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు, వ్యాపారాలు నిర్వహించేందుకు కంపెనీల్లో నెలకొన్న ఆసక్తిని ఇది సూచిస్తోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment