పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ మహిళలకు సంబంధించి కొన్ని కీలక ప్రకటనలు చేశారు. నిర్మలా సీతారామన్ ప్రసంగంలోని బడ్జెట్ ప్రకటనలలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లందరికీ ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆరోగ్య బీమా కవరేజీని విస్తరించడం, లక్షపతి దీదీ పథకం లక్ష్యాన్ని పెంచడం వంటివి ఉన్నాయి.
ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి-జన్ ఆరోగ్య యోజన (AB-PMJAY) అనేది ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ ఫండెడ్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఇది ద్వితీయ, తృతీయ సంరక్షణ ఆసుపత్రిలో చేరేందుకు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ. 5 లక్షల కవరేజీని అందిస్తుంది.
ఇక కేంద్ర ప్రబుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న ‘లక్షపతి దీదీ’ పథకం లక్ష్యాన్ని పెంచనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ పథకం కింద ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2 కోట్ల మంది మహిళలు ప్రయోజనం పొందుతుండగా దీన్ని 3 కోట్ల మందికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే తొమ్మిది నుంచి 14 ఏళ్లలోపు బాలికలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వ్యాక్సినేషన్‌ను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆర్థిక మంత్రి ప్రకటించారు.
మహిళా సాధికారతపై మంత్రి మాట్లాడుతూ, "10 సంవత్సరాలలో ఉన్నత విద్యలో మహిళల నమోదు 28 శాతం పెరిగింది, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమేటిక్స్ (STEM) కోర్సులలో బాలికలు, మహిళలు 43 శాతం నమోదు చేసుకున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యధికం. ఈ పురోగతులన్నీ శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడంలో ప్రతిబింబిస్తాయి. ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేయడం, పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు 1/3 సీట్ల రిజర్వేషన్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 70 శాతం ఇళ్లు మహిళలకు గౌరవాన్ని పెంచాయి." అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment