
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం తన మధ్యంతర బడ్జెట్‌లో ‘లక్షపతి దీదీ’ పథకం గురించి ప్రస్తావించారు. సహాయక గ్రూపు మహిళలకు సంబంధించిన ఈ పథకం లక్ష్యాన్ని పెంచుతున్నట్లు ప్రకటించారు.
"తొమ్మిది కోట్ల మంది మహిళలతో కూడిన 83 లక్షల స్వయం సహాయక సంఘాలు సాధికారత , స్వావలంబనతో గ్రామీణ సామాజిక-ఆర్థిక దృశ్యాన్ని మారుస్తున్నాయి. వారి విజయం ఇప్పటికే దాదాపు కోటి మంది మహిళలను లక్షపతి దీదీలుగా మార్చడానికి సహాయపడింది. ఈ విజయం ఉత్సాహంతో లక్షపతి దీదీ లక్ష్యాన్ని 2 కోట్ల నుంచి 3 కోట్లకు పెంచాలని నిర్ణయించాం" అని నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పార్లమెంటుకు తెలిపారు.
అసలేంటి ఈ పథకం?
గత ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా గ్రామాల్లోని 2 కోట్ల మంది మహిళలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణను అందించేందుకు 'లక్షపతి దీదీ' పథకాన్ని ప్రకటించారు.
ఈ పథకం కింద మహిళలకు ప్లంబింగ్, ఎల్‌ఈడీ బల్బుల తయారీ, డ్రోన్‌లను ఆపరేట్ చేయడం, రిపేర్ చేయడం వంటి నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తారు. తద్వారా మహిళల జీవనోపాధి మెరుగుపడి వారు ఏటా రూ.లక్షకు పైగా ఆదాయాన్ని పొందేలా తోడ్పాటు అందిస్తారు.