కేంద్ర బడ్జెట్ 2024ను జులై 23న ప్రవేశపెడుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని మహిళల సామాజిక, ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేలా నిర్ణయాలు తీసుకోవాలనే డిమాండ్‌లు పెరుగుతున్నాయి. కొత్తగా కంపెనీలు స్థాపించిన మహిళలు వారికి సరైన ప్రోత్సాహకాలు అందించాలంటున్నారు. శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యం పెంచేలా ప్రభుత్వం బడ్జెట్‌లో చర్యలు చేపట్టాలని నిపుణులు కోరుతున్నారు.
పబ్లిక్ పాలసీ కన్సల్టింగ్ సంస్థ టీక్యూహెచ్ కన్సల్టింగ్ సహ వ్యవస్థాపకురాలు అపరాజిత భారతి తెలిపిన వివరాల ప్రకారం.. మహిళల్లో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించాలి. స్టార్టప్ కంపెనీలు కలిగి ఉండడంలో భారతదేశం ప్రపంచంలోనే మూడోస్థానంలో ఉంది. అయినప్పటికీ 2020 నుంచి 2022 వరకు మహిళల నేతృత్వంలోని స్టార్టప్‌లు సేకరించిన నిధుల వాటా మొత్తం స్టార్టప్ ఫండింగ్‌లో కేవలం 15 శాతం మాత్రమే. మహిళలకు సరైన నైపుణ్యాలు అందించి కొత్త కంపెనీలు స్థాపించే దిశగా బడ్జెట్‌లో నిర్ణయాలు తీసుకోవాలి. మహిళలు సారథ్యం వహిస్తున్న స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టేలా క్యాపిటల్ వెంచర్‌లను ప్రోత్సహించేలా బడ్జెట్‌ను రూపొందించాలి’ అని తెలిపారు.
ఇదీ చదవండి: తగ్గనున్న కీలక వడ్డీ రేట్లు..?
ఈ సందర్భంగా కినారా క్యాపిటల్ సీఈఓ హార్దికా షా మాట్లాడుతూ..‘సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) రంగంలోని శ్రామికశక్తిలో మహిళలు కేవలం 20 శాతం మాత్రమే ఉన్నారు. వారికి సరైన నైపుణ్యాలు, ప్రోత్సాహకాలు అందించి ఎంఎస్‌ఎంఈలో పనిచేసేలా నిర్ణయం తీసుకోవాలి. మహిళా శ్రామిక శక్తి 2021-22లో 32.8 శాతం నుంచి 2022-23లో 37 శాతానికి పెరిగినప్పటికీ దీన్ని మరింత పెంచేలా చర్యలు చేపట్టాలి. సమీప భవిష్యత్తులో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు లక్ష్యం 8 శాతంగా నిర్ణయించారు. దాన్ని సాధించడానికి మహిళల శ్రామిక భాగస్వామ్యాన్ని 50 శాతానికి పెంచడం చాలా ముఖ్యం’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment