తన బృందంతో మథురదాస్ గుప్త
‘ఇల్లు కట్టి చూడు’ అన్నారుగానీ ‘ఉద్యోగం చేసి చూడు’ అనలేదు. అనకపోతేనేం... ఉద్యోగం చేయడం ఆషామాషీ విషయం కాదు. ఉద్యోగం అనేది కేవలం ఉపాధి మాత్రమే కాదు. మనలోని శక్తులను సంపూర్ణంగా ఆవిష్కరించుకోవడం. ఈ ఎరుకతోనే ‘ఎస్పైర్ ఫర్ హర్’ స్టార్టప్‌కు శ్రీకారం చుట్టింది మథురదాస్ గుప్త. తాజాగా... టెక్ దిగ్గజం గూగుల్ వారి ‘గూగుల్ ఫర్ స్టార్టప్’ కార్యక్రమానికి ఎంపికైన స్టార్టప్ ఫౌండర్‌లలో దాస్ ఒకరు...
రకరకాల కారణాల వల్ల మహిళలు ఉద్యోగాలకు దూరం అవుతున్నారు. కొందరు ‘ఉద్యోగం మా పని కాదు’ అనుకుంటున్నారు. కొందరికి ఉద్యోగం చేయాలని ఉంటుంది. కాని దారి ఏమిటో తెలియదు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ‘మహిళల ఆర్థిక స్వాతంత్య్రం’ లక్ష్యంగా ‘ఎస్పైర్ ఫర్ హర్’ (ఎఎఫ్‌హెచ్) స్టార్టప్‌కు శ్రీకారం చుట్టింది ముంబైకి చెందిన మ«థురదాస్ గుప్త. ఇరవై అయిదు సంవత్సరాల పాటు బ్యాంకింగ్ రంగంలో పని చేసిన దాస్, అద్భుతమైన ప్రతిభ ఉండి కూడా ఇంటిపట్టునే ఉంటున్న ఎంతోమంది మహిళలను చూసింది. ‘మీరు ఎందుకు ఉద్యోగం చేయకూడదు?’ అని అడిగితే ‘పిల్లల్ని ఎవరు చూసుకుంటారు?’ ‘ఇంటిపనులు ఎవరు చేస్తారు?’ ‘మా ఆయన ఉద్యోగం చేస్తున్నాడు కదా. మళ్లీ నేను ఎందుకు?’... ఇలా రకరకాల మాటలు వినిపించేవి.
మరోవైపు ఉద్యోగాలలో స్త్రీ పురుషులకు మధ్య ఉన్న భారీ అంతరం బాధ పెట్టేది.
‘భద్రమైన ఉద్యోగాన్ని వదిలి రిస్క్ చేస్తున్నావు... అని హెచ్చరించారు చాలామంది. ‘‘అయితే నేను డబ్బుల కోసం కాదు ఒక మంచిపని కోసం ఈ స్టార్టప్ మొదలుపెట్టాను. మంచిపని చేస్తున్నాననే భావన నాకు ధైర్యాన్ని, బలాన్ని ఇచ్చి ముందుకు నడిపించింది’’ అంటుంది మథుర.
‘ఏఎఫ్‌హెచ్’లో లక్షా యాభైవేలమంది సభ్యులు ఉన్నారు. దేశ విదేశాల నుంచి ఎంతోమంది నిపుణులు, సంస్థల మద్దతు ఉంది. ఆయా రంగాల నిపుణుల ద్వారా సభ్యులకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ శిక్షణ ఇప్పిస్తోంది ఎఎఫ్‌హెచ్.
‘ఏఎఫ్‌హెచ్’ సాధించిన విజయాల గురించి చెప్పుకోవాలంటే కోల్‌కతాకు చెందిన ఆద్రిజ నుంచి మొదలు బిజోయెత మైత్ర వరకు ఎంతమంది గురించి అయినా చెప్పుకోవచ్చు. తల్లిదండ్రులు చనిపోవడంతో కుంగుబాటు బారిన పడింది అద్రిజ. ఒకరోజు టీచర్ దగ్గరకు వెళ్లి ‘నేను బోర్డ్ ఎగ్జామ్స్ కూడా పాస్ కాలేను’ అన్నది. చదువులో చురుగ్గా ఉండే అమ్మాయి, భవిష్యత్ గురించి ఎన్నో కలలు కన్న అమ్మాయి ‘ఇక నేను ఏమీ చేయలేను’ అంటూ దీనంగా నిల్చోవడం వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. వెంటనే ‘ఎఎఫ్‌హెచ్’ బాధ్యులకు పరిచయం చేశారు. ‘ఏఎఫ్‌హెచ్’లోకి అడుగుపెట్టడంతో ఆమెలో పూర్తిగా మార్పు వచ్చింది.
‘కష్టకాలంలో నాకు వెన్నుదన్నుగా ఉన్నారు. నేను ఏదైనా సాధించగలను అనే నమ్మకాన్ని నింపారు’ అని ఉత్సాహంగా చెబుతుంది ఆద్రిజ.
కోవిడ్ కాలంలో బిజోయెత మైత్ర తన భర్తను కోల్పోయింది. ఇల్లు గడవడానికి ఆయన సంపాదనే ఆధారం. తానేమో ఎప్పుడూ ఉద్యోగం చేసింది లేదు. కూతురి గురించి ఆలోచిస్తూ మరింత బాధకు గురయ్యేది.
‘అదేపనిగా దిగులు పడడం తప్ప ఏం చేయాలో తెలియని రోజుల్లో, ఒకరి సలహా మేరకు ఏఎఫ్‌హెచ్ బాధ్యులను కలిశాను. వారు నాలో ఎంతో ధైర్యం నింపారు. నేను ఒంటరిని అనే బాధ దూరమై, నా వెనక పెద్ద కుటుంబం ఉందనే మానసిక బలం వచ్చింది’ అంటున్న మైత్ర ప్రస్తుతం ఎంటర్‌ప్రెన్యూర్, వెల్‌నెస్ అడ్వైజర్‌గా రాణిస్తోంది.
‘ఉద్యోగం చేయాలనే కోరిక బలంగా ఉన్నా, నేను చదివిన చదువుకు ఏ ఉద్యోగం వస్తుంది అనే అపనమ్మకం ఉండేది. అయితే ఏఎఫ్‌హెచ్ నాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. నన్ను బాగా అర్థం చేసుకున్న తరువాత, ‘నీలో ఈ ప్రతిభ ఉంది, ఈ రంగంలో నీకు తప్పకుండా ఉద్యోగం దొరుకుతుంది’ అని నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఇప్పుడు నేను మంచి ఉద్యోగంలో ఉండడానికి ఏఎఫ్‌హెచ్ కారణం’ అంటుంది ముంబైకి చెందిన 29 సంవత్సరాల వినీత.
‘ఎస్పైర్ ఫర్ హర్’ అద్భుత విజయం సాధించింది అని వీరి మాటలు చెప్పకనే చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment