మూడేళ్లలో సగం ఎస్‌యూవీలే | BYD India inaugurates its first passenger vehicles showroom at Hyderabad | Sakshi
Sakshi News home page

మూడేళ్లలో సగం ఎస్‌యూవీలే

Published Sat, Aug 27 2022 5:12 AM | Last Updated on Sat, Aug 27 2022 5:12 AM

BYD India inaugurates its first passenger vehicles showroom at Hyderabad - Sakshi

ఈ6 కారుతో సంజయ్‌ గోపాలకృష్ణన్, మోడీ గ్రూప్‌ ఎండీ నిహార్‌ మోడీ (కుడి)

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశంలో స్పోర్ట్‌ యుటిలిటీ వెహికల్స్‌ (ఎస్‌యూవీ) హవా నడుస్తోంది. అభివృద్ధి చెందిన మార్కెట్లలో ఎస్‌యూవీల వాటా 35–38 శాతం ఉంటే.. భారత్‌లో ఇది 42 శాతమని బీవైడీ ఇండియా ఎలక్ట్రిక్‌ ప్యాసింజర్‌ వెహికిల్స్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సంజయ్‌ గోపాలకృష్ణన్‌ తెలిపారు. భారత్‌లో సంస్థ మూడవ షోరూం మోడీ బీవైడీని హైదరాబాద్‌లో శుక్రవారం ప్రారంభించిన సందర్భంగా సాక్షి బిజినెస్‌ బ్యూరోతో మాట్లాడారు. మూడేళ్లలో ఎస్‌యూవీల వాటా 50 శాతానికి చేరుతుందన్నారు. హ్యాచ్‌బ్యాక్‌ల ధరలోనే రూ. 6–7 లక్షల నుంచే ఈ మోడళ్లు లభ్యం కావడం ఈ స్థాయి అమ్మకాలకు కారణమని చెప్పారు. ఆయనింకా ఏమన్నారంటే..

ధర ప్రాధాన్యత కాదు..  
ప్యాసింజర్‌ వెహికల్స్‌ విషయంలో హైదరాబాద్‌ విభిన్న మార్కెట్‌. ఇక్కడి మార్కెట్లో ఏం జరుగుతుందో అంచనా వేయలేం. గడిచిన అయిదేళ్లలో హైదరాబాద్‌ విపణి గణనీయంగా వృద్ధి చెందింది. విక్రయాల పరంగా ఢిల్లీ, బెంగళూరు తర్వాత భాగ్యనగరి టాప్‌లో నిలిచింది. కారు కొనుగోలు నిర్ణయం విషయంలో ఒకప్పుడు ధర ప్రామాణికంగా ఉండేది. ప్రాధాన్యత క్రమంలో ఇప్పుడు బ్రాండ్, ఎక్స్‌టీరియర్స్, ఇంటీరియర్స్, ఫీచర్స్, సేఫ్టీ తర్వాత ధర నిలిచింది. దేశవ్యాప్తంగా జూలైలో ప్యాసింజర్‌ కార్లు 2,50,972 యూనిట్లు
అమ్ముడయ్యాయి.  

ఈ ఏడాది 50,000 యూనిట్లు..
దేశంలో సగటున నెలకు అన్ని బ్రాండ్లవి కలిపి 3,500 ఎలక్ట్రిక్‌ కార్లు అమ్ముడవుతున్నాయి. ఈ ఏడాది జూలై నాటికి 26,000 యూనిట్లు రోడ్డెక్కాయి. 2022లో దేశవ్యాప్తంగా 50,000 ఎలక్ట్రిక్‌ కార్లు అమ్ముడవుతాయని అంచనా. ప్యాసింజర్‌ వాహన రంగంలో ఈవీల వాటా 2 శాతమే. ఇది 2030 నాటికి 30 శాతానికి చేరనుంది. ఇక ఎలక్ట్రిక్‌ ప్యాసింజర్‌ వాహన విక్రయాల్లో టాప్‌–1 ర్యాంక్‌ కోసం హైదరాబాద్, బెంగళూరు పోటీపడుతున్నాయి. ఈ–ప్యాసింజర్‌ వెహికల్స్‌లో దక్షిణాది వాటా 50–60 శాతంగా ఉంది. కస్టమర్లు తమ రెండవ కారుగా ఈవీని కొనుగోలు చేస్తున్నారు.  

భారీ లక్ష్యంతో..
అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న కార్లను భారత్‌లో పరిచయం చేస్తాం. బీవైడీ ఎలక్ట్రిక్‌ కారు ఈ6ను 2021 నవంబర్‌లో ప్రవేశపెట్టాం. 450 యూనిట్లు విక్రయించాం. ఒకసారి చార్జింగ్‌ చేస్తే ఈ కారు 520 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దీపావళికి ప్రీమియం ఈ–ఎస్‌యూవీని ప్రకటించనున్నాం. జనవరి నుంచి డెలివరీలు ఉంటాయి. 2030 నాటికి ఈ–ప్యాసింజర్‌ వెహికల్స్‌ రంగంలో దేశంలో 30 శాతం మార్కెట్‌ను కైవసం చేసుకుంటాం. బీవైడీ భారత్‌లో ఇప్పటివరకు సుమారు రూ.1,185 కోట్లు వెచ్చించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement