
న్యూ ఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురును అందించింది. ఎలాంటి రుసుం లేకుండా వాహన రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునని కేంద్రం నిర్ణయించింది. ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యువల్ రుసుం నుంచి కూడా మినహాయింపును ఇచ్చింది. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమకు అదనపు ప్రోత్సహకంగా సెంట్రల్ మోటార్ వాహనాల నియమాలు-1989 సవరించాలని కేంద్రం గతంలోనే ప్రతిపాదించింది.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పలు దిగ్గజ ఆటోమోబైల్ కంపెనీలు భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని వేగవంతంగా చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీలను అందిస్తున్నాయి.