న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుపై టాటా ఆటోకాంప్ దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా ఆస్ట్రేలియాకి చెందిన ట్రీటియం సంస్థతో చేతులు కలిపింది. ఈ అవగాహన ఒప్పందం (ఎంవోయూ) ట్రీటియం తయారు చేసే డైరెక్ట్ కరెంట్ (డీసీ) ఫాస్ట్ చార్జర్లను భారత్‌లో అందుబాటులోకి తేనున్నట్లు టాటా ఆటోకాంప్ ఒక ప్రకటనలో తెలిపింది. డీసీ చార్జింగ్ ఇన్‌ఫ్రా కంపెనీ అయిన ట్రీటియం.. అంతర్జాతీయంగా ఆటోమొబైల్ సంస్థలకు చార్జర్లను సరఫరా చేస్తోంది.
ట్రీటియం తయారు చేసే వీఫిల్–ఆర్‌టీ డీసీ ఫాస్ట్ చార్జర్లు.. ఇటు ద్విచక్రవాహనాల నుంచి కార్లు, వాణిజ్య వాహనాల దాకా వివిధ రకాల వాహనాలను వేగంగా చార్జ్ చేసేందుకు వాడతారని టాటా ఆటోకాంప్ సిస్టమ్స్ ఎండీ, సీఈవో అరవింద్ గోయల్ చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో చార్జర్ల అవసరం కూడా గణనీయంగా ఉండనుందన్నారు. ఈ మార్కెట్లో అపార అవకాశాలున్నాయని, ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని గోయల్ తెలిపారు. ఇటీవలే ప్రకటించిన రెండో విడత ఫేమ్ పథకంలో భాగంగా చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కూడా తోడ్పాటు లభించనుంది.
Comments
Please login to add a commentAdd a comment