న్యూఢిల్లీ: ప్రభుత్వ శాఖలు, వివిధ విభాగాల డేటా బహిరంగంగా అందుబాటులో ఉంచే విధంగా కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ కసరత్తు చేస్తోంది. డేటా అందుబాటులో ఉండటం, వినియోగానికి సంబంధించి భారత ప్రభుత్వ విధానం ముసాయిదాను రూపొందించింది. దీనిపై ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తోంది.
ముసాయిదా సిద్ధం
ఇప్పటికే రూపొందించిన ముసాయిదా ప్రకారం వివిధ శాఖలు, డిపార్ట్‌మెంట్‌లు, ఆధీకృత ఏజెన్సీలకు సంబంధించిన సమాచారంతో పాటు వాటి ద్వారా ప్రభుత్వం సేకరించే డేటా కూడా బహిరంగంగా అందుబాటులో ఉంటుంది. కొన్ని షరతులకు లోబడి డిఫాల్టుగా వివిధ విభాగాలు, సంబంధిత వర్గాలు ఒకరికొకరు కూడా ఈ సమాచారాన్ని షేర్ చేసుకోవచ్చు. ఒక మోస్తరుగా ప్రాసెస్ చేసిన డేటా ఉచితంగానే అందుబాటులో ఉంటుంది. అయితే, పరిమితులు వర్తించే డేటాను పొందేందుకు కొంత రుసుములు చెల్లించాల్సి వస్తుంది. అది ఎంత మొత్తం ఉండాలనేది.. ఆయా విభాగాలు, ఏజెన్సీలు పారదర్శకంగా నోటిఫై చేయాలి. ఈ ముసాయిదాపై సంబంధిత వర్గాలు మార్చి 18లోగా తమ అభిప్రాయాలు తెలియజేయాల్సి ఉంటుంది.
ఇండియా డేటా ఆఫీస్..
ఇలా డేటా యాక్సెస్, షేరింగ్ కార్యకలాపాలను క్రమబద్ధీకరించేందుకు ‘ఇండియా డేటా ఆఫీస్’ను ఏర్పాటు చేయాలని ఐటీ శాఖ ప్రతిపాదించింది. వివిధ శాఖలు, విభాగాలు, రాష్ట్రాల ప్రభుత్వాలతో ఇది సంప్రదింపులు కూడా జరపాల్సి ఉంటుంది. ఇండియా డేటా ఆఫీసర్, వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విభాగాల చీఫ్ డేటా ఆఫీసర్లు ఇందులో భాగంగా ఉంటారు. ‘ప్రతి శాఖ/విభాగంలో చీఫ్ డేటా ఆఫీసర్ల నేతృత్వంలో డేటా మేనేజ్‌మెంట్ యూనిట్లు ఉండాలి. డేటా పాలసీ అమలు కోసం ఇండియా డేటా ఆఫీస్‌తో ఇవి కలిసి పనిచేయాలి‘ అని పేర్కొంది.
డిజిటల్ ఎకానమీ
భారత్ 5 లక్షల కోట్ల డాలర్ల డిజిటల్ ఎకానమీగా ఎదిగే క్రమంలో డేటాను సమర్థమంతంగా వినియోగించుకోవడంపై ఆధారపడి ఉంటుందని ముసాయిదా పేర్కొంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే .. ప్రస్తుత, కొంగొత్త టెక్నాలజీలకు అనుగుణంగా నాణ్యమైన డేటాను అందుబాటులో ఉంచడం, వినియోగం మెరుగుపర్చాలన్నది డేటా పాలసీ లక్ష్యమని తెలిపింది. మరోవైపు, పౌరుల వివరాల గోప్యత కాపాడేందుకు ఉపయోగపడే ప్రతిపాదనలు కూడా ఇందులో ప్రస్తావించారు.
Comments
Please login to add a commentAdd a comment