న్యూఢిల్లీ: దీపావళి పండుగ వేళ కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు తీపి కబురు అందించింది. నింగిలోకి దూసుకెళ్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గేలా బుధవారం అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. వీటిపై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని లీటర్ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 చొప్పున తగ్గించింది. ఈ తగ్గింపు గురు వారం నుంచే అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటన జారీ చేసింది. దేశంలో పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని ఈ స్థాయిలో తగ్గించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ తగ్గింపుతో దేశవ్యాప్తంగా పెట్రోల్ ధర లీటర్‌కు రూ.5, డీజిల్ ధర రూ.10 చొప్పున తగ్గనుంది. కొన్ని నెలలుగా వరుసగా పెరుగుతున్న ధరలు కొంత తగ్గడంతో ప్రజలకు ఆ మేరకు ఊరట లభించనుంది.
వ్యవసాయ రంగానికి మేలు
డీజిల్ ధర దిగి రావడం వ్యవసాయ రంగానికి ఎంతగానో మేలు చేయనుందని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. ‘‘లాక్‌డౌన్ కాలంలోనూ రైతులు తమ శ్రమ ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా తోడ్పాటు అందించారు. డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో రాబోయే రబీ సీజన్‌లో రైతాంగానికి మేలు జరుగుతుంది. ఇటీవలి కాలంలో ముడి చమురు ధరలు అంతర్జాతీయంగా విపరీతంగా పెరిగాయి. ఫలితంగా భారత్‌లోనూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరగక తప్పలేదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల ఇంధనాల కొరత కనిపించింది. ధరలు పెరిగాయి. మన దేశంలో ఇంధనాల కొరత తలెత్తకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంది. దేశ అవసరాలకు సరిపడా పెట్రోల్, డీజిల్ వంటి వాటిని అందుబాటులోకి తీసుకొచ్చింది.
కోవిడ్–19 వ్యాప్తి వల్ల డీలా పడిన దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు మళ్లీ గాడిలో పడింది. తయారీ, సేవలు, వ్యవసాయం తదితర రంగాల్లో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతం ఇవ్వడానికి పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని గణనీయంగా తగ్గించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల ఇంధనాల వినియోగం పెరుగుతుంది, ద్రవ్యోల్బణం తగ్గుతుంది. పేదలు, మధ్య తరగతి ప్రజలకు లబ్ధి చేకూరుతుంది..’’ అని ఆర్థిక శాఖ పేర్కొంది. డీజిల్ రేటు తగ్గడం వల్ల పంటల సాగుకు పెట్టుబడి వ్యయం స్వల్పంగానైనా తగ్గనుంది. తద్వారా రైతాంగంపై కొంత భారం దిగిపోయినట్లే. కాగా వినియోగదారులకు మరింత ఉపశమనం కలిగించడానికి రాష్ట్రాలు సైతం పెట్రోల్, డీజిల్‌పై విలువ ఆధారిత పన్ను (వ్యాట్) తగ్గించాలని కేంద్ర ఆర్థిక శాఖ సూచించింది.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్‌పై రూ.32.90, లీటర్ డీజిల్‌పై రూ. 31.80 చొప్పున ఎక్సైజ్ డ్యూటీ (సెస్‌లతో కలిపి) విధిస్తోంది. ఇందులో నుంచి పెట్రోల్‌పై ఐదు రూపాయలు, డీజిల్‌పై 10 రూపాయలు తగ్గించనుంది. దీని ప్రభావం మన రాష్ట్ర పన్నులపై కూడా పడనుంది. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై సుమారు రూ.6.81, డీజిల్‌పై రూ.12.73 తగ్గనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.114.47, డీజిల్ రూ.107.37 ధరలు ఉండగా, తగ్గిన సుంకంతో పెట్రోల్ రూ.107.66కు, డీజిల్ రూ.94.64కు తగ్గే అవకాశం ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రేటు రూ.110.04 నుంచి రూ.105.04కు, డీజిల్ రేటు రూ.98.42 నుంచి రూ.88.42కు తగ్గిపోనుంది.
ఎన్నికల్లో పరాజయాలతో అప్రమత్తం
దేశంలో పెట్రో ధరలు రికార్డు స్థాయిలో పెరగడంతో ప్రభుత్వంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. చాలా రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధర రూ.100 మార్కును ఎప్పుడో దాటేసింది. మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లో అయితే లీటర్ పెట్రోల్ రేటు రూ.120కి చేరింది. ఈ పరిణామాలు కేంద్ర ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. మరోవైపు కొన్ని రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికలు బీజేపీకి చేదు అనుభవాల్నే మిగిల్చాయి. ప్రజాగ్రహాన్ని గుర్తించిన కేంద్రం ఒక మెట్టు కిందికి దిగిరాక తప్పలేదు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు జరిగిన పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని పరిశీలిస్తే ఎక్సైజ్ సుంకం తగ్గింపు వల్ల ప్రభుత్వ ఖజానాకు నెలకు రూ.8,700 కోట్ల మేర నష్టం వాటిల్లనుంది. అంటే సంవత్సరానికి రూ.లక్ష కోట్ల పైమాటేనని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఉన్న కాలానికి రూ.43,500 కోట్ల నష్టం వాటిల్లనుంది.
Petrol and Diesel Price : వాహనదారులకు కేంద్రం శుభవార్త..!
Published Wed, Nov 3 2021 8:16 PM | Last Updated on Thu, Nov 4 2021 7:25 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment