ఆసియా కుబేరుడిగా పేరున్న ముఖేశ్ అంబానీ ఇంట్లో పెళ్లి సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆయన రెండో కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌ల వివాహం జులై 12న జరుగనుంది. అయితే పెళ్లి పీటలెక్కనున్న జంట ఏం చదువుకుందనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో అనంత్ ఏ పాత్ర పోషిస్తున్నారు? వీరెన్ మర్చెంట్ కూతురిగా ఎన్‌కోర్ హెల్త్‌కేర్‌లో కొత్త పెళ్లి కూతురు ఏ పొజిషన్‌లో ఉన్నారు..? అనే విషయాలను తెలుసుకుందాం.
అనంత్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ-నీతా అంబానీల రెండో కుమారుడు అనంత్ అంబానీ. ఆయన తన పాఠశాల విద్యను ముంబయిలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో పూర్తి చేశారు. యూఎస్‌ఏలోని రోడ్ ఐలాండ్‌లో ఉన్న బ్రౌన్ విశ్వవిద్యాలయం నుంచి బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ పట్టా పొందారు. అనంత్ అన్నయ్య ఆకాష్ అంబానీ కూడా బ్రౌన్ యూనివర్శిటీ పూర్వ విద్యార్ధి. ఆకాష్ ఆర్థిక శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. ముఖేశ్ కూతురు, కుమారులు ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీలు ఆగస్టు 2023లో రిలయన్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌గా చేరారు. ప్రస్తుతం అనంత్ అంబానీ రిలయన్స్ న్యూ ఎనర్జీకి సారథ్యం వహిస్తున్నారు.
రాధిక మర్చంట్
ఎన్‌కోర్ హెల్త్‌కేర్ గ్రూప్ వ్యవస్థాపకుడు వీరెన్ మర్చంట్-శైలా మర్చంట్‌ల కూతురు రాధిక మర్చంట్. ఆమె తన పాఠశాల విద్యను 1999 నుంచి 2006 వరకు కేథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్‌లో, 2006 నుంచి 2009 వరకు ఎకోల్ మొండియేల్ వరల్డ్ స్కూల్‌లో, 2009 నుంచి 2013 వరకు ముంబయిలోని బీడీ సోమాని ఇంటర్నేషనల్ స్కూల్‌లో పూర్తి చేశారు. ఆమె లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ప్రకారం..యూఎస్‌ఏలోని న్యూయార్క్‌లో ఉన్న న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ పట్టా పొందారు. రాధిక మర్చంట్, ఆమె సోదరి అంజలి మర్చంట్ ఎన్‌కోర్ హెల్త్‌కేర్ డైరెక్టర్ల బోర్డులో ఉన్నారు. ఆమె తండ్రి వీరెన్ మర్చంట్ కంపెనీ సీఈఓగా వ్యవహరిస్తున్నారు. తల్లి శైలా మర్చంట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఇదీ చదవండి: ‘అనంత్-రాధికల పెళ్లికి ప్రభుత్వం సెలవు ప్రకటించాలి’
అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహ వేడుకలు శుక్రవారం(జులై 12)న శుభ వివాహ్‌తో ప్రారంభమవుతాయి. జులై 13 శనివారం శుభ్ ఆశీర్వాద్, జులై 14న మంగళ్ ఉత్సవ్ కార్యక్రమాలతో ముగుస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment