China Ease of doing business index Scam: డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్‌ల విషయంలో చైనా భారీ అవినీతికి పాల్పడిందన్న ఆరోపణలు.. ఇప్పుడు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ర్యాంకింగ్‌లో పురోగతి అనేది దేశ ఆర్థిక పురోగతిని, అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్టుబడుల్ని ప్రభావితం చేసే అంశం. అయితే అంతటి బలమైన వ్యవస్థను.. చైనా అంతతేలికగా ఎలా ప్రభావితం చేయగలిగిందన్నది ఇప్పుడు ప్రధానంగా వ్యక్తం అవుతున్న అనుమానం. ఇక ఈ ఆరోపణలు వెలుగుచూడడంతో.. డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్‌ల విడుదలను నిలిపివేస్తూ(ఈ ఏడాదికి మాత్రమేనా? శాశ్వతంగానా?) ప్రపంచ బ్యాంక్ సంస్థ ప్రకటించడంతో అన్ని దేశాలు దిగ్‌భ్రాంతికి లోనయ్యాయి.
డబ్ల్యూటీవో రూల్స్‌ను కాలి కింద తొక్కిపట్టి మరీ.. ప్రపంచ మార్కెట్‌ను శాసించాలనే అత్యాశ ఇప్పుడు పాముగా మారి డ్రాగన్ మెడకు చుట్టుకుంటోంది.
డూయింగ్ బిజినెస్ ర్యాకింగ్స్‌లో అవకతవకలు బయటపడడంతో అంతర్జాతీయ సమాజం చైనాపై దుమ్మెత్తిపోస్తోంది. గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు వీలుగా.. చైనా డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌లో పైరవీలు చేసి మెరుగైన ర్యాంకులు సంపాదించింది. డూయింగ్ బిజినెస్ ర్యాకింగ్స్‌లో.. 2018 ఏడాదికి(హాంకాంగ్‌తో కలిసి ఐదవ స్థానం-వ్యక్తిగతంగా 78వ స్థానం, 2020లో హాంకాంగ్‌తో కలిసి మూడవ స్థానం-వ్యక్తిగతంగా 31వ స్థానానికి ఎగబాకింది. అయితే 2018, 2020తో పాటు మధ్యలో 2019లోనూ ఫేక్ ర్యాంక్ దక్కించుకుందనేది ప్రపంచ బ్యాంక్ అంతర్గత దర్యాప్తు వెల్లడించిన అంశం.
ఉన్నత పదవుల్లో అవినీతి, నివేదికల్లో డేటాపరమైన అవకతవకలు, బ్యాంకు సిబ్బంది నైతిక విలువలు పాటించకపోవడం వంటి వ్యవహారాలు చైనా ర్యాంక్‌ను ప్రభావితం చేశాయని దర్యాప్తు వెల్లడించింది. ఇవేకాదు.. అంతర్గతంగా విచారణ ద్వారా మరిన్ని నిజాల్ని నిగ్గు తేలుస్తామని ఇప్పటికే ప్రపంచ బ్యాంకు ప్రకటించుకుంది కూడా. గత రెండు దశాబ్దాలుగా ఐఎంఎఫ్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వంటి అంతర్జాతీయ సంస్థలపై పట్టు సాధించేందుకు చైనా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో తాజా పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆరోపణలు నిజమని తేలితే.. చైనాపై కొంతకాలం కఠిన ఆంక్షలు విధించడంతో పాటు విదేశీ పెట్టుబడులకు అనుమతుల నిరాకరణకు ఆదేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వరల్డ్ బ్యాంక్ మాజీ ప్రెసిడెంట్ జిమ్ యోంగ్ కిమ్, సీఈవో(ప్రస్తుతం కూడా) క్రిస్టలీనా జార్జియేవా.. ఒత్తిళ్ల మేరకు చైనాకు మెరుగైన ర్యాంకింగ్ లభించేలా వరల్డ్ బ్యాంక్ సిబ్బంది డేటాను మార్చేశారని ఈ వ్యవహారంలో దర్యాప్తు చేపట్టిన న్యాయసేవల సంస్థ విల్మర్‌హేల్ నిర్ధారించింది.
పాక్ పాత్ర కూడా..
ప్రస్తుతం డూయింగ్ బిజినెస్ ర్యాకింగ్‌లో చైనా పైరవీల వ్యవహారంపై వరల్డ్ బ్యాంక్ ఎథిక్స్ కమిటీ దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో పాకిస్థాన్ పాత్రను కూడా గుర్తించినట్లు సమాచారం. పాక్ లాంటి దేశాల వెన్నుదన్నుతోనే చైనా ఫేక్ ర్యాంకింగ్‌తో డూయింగ్ బిజినెస్ లిస్ట్‌లో ఎగబాకగలిగిందని ఎథిక్స్ కమిటీ సమర్పించిన 16 పేజీల నోట్‌లో ఓ ముఖ్యాంశంగా ఉంది. చైనాను హైలీ ప్రమోట్ చేయడం ద్వారా పాక్ సైతం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నట్లు అయ్యింది. అంతేకాదు గ్లోబల్ ఇన్వెస్టర్లను చైనాకు మళ్లించేలా ప్రభావితం చేయడంతో పాటు చైనాతో పరస్పర సహకారం భారీ ముడుపులు పాక్ అందుకుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చైనాతో ఆర్థిక లావాదేవీల కొనసాగింపు, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, ఇస్లామాబాద్-ఫైసలాబాద్-కరాచీలలో భారీ పెట్టుబడుల హామీతోనే చైనాకు పాక్ మద్దతుగా నిలుస్తోందనేది ఆ నివేదికలోని సారాంశం. మరో విషయం ఏంటంటే.. ప్రపంచ ఆరోగ్య సంస్థను సైతం ప్రభావితం చేస్తూ చైనా ఈ తతంగాన్ని నడిపించిందని.
కావాలంటే ఎంక్వైరీ చేస్కోండి
చైనా ఈ ఆరోపణలు తోసిపుచ్చుతోంది. ఇదంతా అమెరికా కుట్రలో భాగమని అంటోంది. అంతర్గత దర్యాప్తు కాదు.. అవసరమైతే నిఘా వర్గాలతోనూ దర్యాప్తు జరిపించుకోండంటూ ప్రపంచ బ్యాంకుకు సవాల్ విసురుతోంది. మరోవైపు, ప్రపంచ బ్యాంకు ఈ ఆరోపణలపై సమగ్రమైన విచారణ నిర్వహించాలని, విశ్వసనీయతను పాటించాలని చైనా విదేశాంగ శాఖ అభిప్రాయపడింది. ఇక అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)కి డైరెక్టరుగా ఉన్న జార్జియేవా ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. విచారణ నివేదికలో వెల్లడైన విషయాలతో విభేదిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇక ఆ టైంలో వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా పని చేసిన జిమ్ కిమ్ సైతం ఆరోపణల్ని తోసిపుచ్చారు.
వరల్డ్ బ్యాంక్ ఎథిక్స్ కమిటీ.. ఈ ఆరోపణలపై దర్యాప్తు జరుపుతోంది. సెప్టెంబర్ 15న ‘ఇన్వెస్టిగేషన్ ఆఫ్ డేటా ఇర్రెగ్యులారిటీస్ ఇన్ డూయింగ్ బిజినెస్ 2018 అండ్ డూయింగ్స్ బిజినెస్ 2020.. ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్ అండ్ రిపోర్ట్ టు ది బోర్డ్ ఆఫ్ మేనేజింగ్ డైరెక్టర్స్’ పేరుతో 16 పేజీల రిపోర్ట్‌ను తయారు చేసింది ఎథిక్స్ కమిటీ. . అవుట్‌డేటెడ్ మల్టీలాటెరల్ స్ట్రక్చర్స్, అవినీతి లాంటి చైనా ప్రయత్నాలపై ఈ నివేదిక వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఓవైపు ఆర్థికంగా వరుస దెబ్బలు.. తాజాగా డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ ఆరోపణలు చైనాను మరింత ఇరకాటంలోకి నెట్టేయడం ఖాయంగా కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment