
బీజింగ్: చైనా ఎకానమీ వృద్ధి రేటు ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో (జనవరి, ఫిబ్రవరి, మార్చి) 4.8 శాతంగా నమోదయ్యింది. ఈ ఏడాదిలో 5.5 శాతం పురోగతి సాధించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్న కమ్యూనిస్టు దేశం, తొలి క్వార్టర్‌లో మాత్రం ఈ అంకెను అందుకోలేకపోవడం గమనార్హం. దీనికి కోవిడ్–19 తాజా కేసుల తీవ్రత, భౌగోళిక ఉద్రిక్తతలు కారణమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
కోవిడ్–19 కేసుల తాజా విజృంభన నేపథ్యంలో షాంఘైసహా పలు కీలక వ్యాపార పట్టణాల్లో లాక్‌డౌన్ విధించినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో వాణిజ్య కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నట్లు సమాచారం. కాగా, త్రైమాసికం పరంగా చూస్తే, (2021 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో 4 శాతం పురోగతి) ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు పుంజుకున్నట్లు నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (ఎన్‌బీఎస్) గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
గణాంకాల ప్రకారం, 2021 ఇదే కాలంతో పోల్చిచూస్తే, పారిశ్రామిక ఉత్పత్తి 6.5 శాతంగా ఉంది. పెట్టుబడుల్లో వృద్ధి 9.3 శాతం. కన్జూమర్ గూడ్స్ రిటైల్ అమ్మకాలు 3.3 శాతం పెరిగాయి.
చదవండి: భారత్‌కు పొంచి ఉన్న ముప్పు..! ఎకానమీపై తీవ్ర ప్రభావం..!