ముంబై: బంగారం తనఖాతో రుణాలను ఇచ్చే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్‌బీఎఫ్‌సీలు) నిర్వహణలోని ఆస్తులు (రుణాలు) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 18–20 శాతం మేర పెరిగి రూ.1.3 లక్షల కోట్లకు చేరుకోవచ్చని క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. బంగారం రుణాలకు ఎక్కువ డిమాండ్ ఉన్నట్టు పేర్కొంది. పండుగల సీజన్ కావడం, ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్నందున.. సూక్ష్మ సంస్థలు తమ వ్యాపార నిర్వహణ కోసం, వ్యక్తులు తమ అవసరాలను అధిగమించేందుకు బంగారం రుణాలను తీసుకోవడం పెరిగినట్టు తెలిపింది. పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌లను గణనీయంగా సడలించడం ఇందుకు మద్దతుగా నిలుస్తున్నట్టు వివరించింది. ఈ మేరకు ఒక నివేదికను మంగళవారం విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) బంగారం రుణాలు పుంజుకున్నట్టు కేర్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ కృష్ణన్ సీతారామన్ చెప్పారు. ‘‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మిగిలిన కాలంలోనూ ఇదే ధోరణి కొనసాగొచ్చు. ఇతర రిటైల్ రుణాల విషయంలో రుణదాతలు అప్రమత్త ధోరణితో ఉన్నందున.. బంగారం రుణాలకు డిమాండ్ కొనసాగుతుంది’’ అని సీతారామన్ పేర్కొన్నారు. బంగారంపై రుణాలను బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు సురక్షిత సాధనంగా భావిస్తుంటాయి. రుణ గ్రహీతలు చెల్లించలేని పరిస్థితుల్లో ఇతర రుణాలతో పోలిస్తే నష్టాలు చాలా పరిమితంగా ఉండడమే ఇందుకు కారణం. అయితే, ఈ రుణాల్లో లోన్ టు వ్యాల్యూ (బంగారం విలువలో ఇచ్చే రుణం శాతం) విషయంలో క్రమశిక్షణగా వ్యవహరిస్తే అది సౌకర్యాన్నిస్తుందని క్రిసిల్ తెలిపింది.
ఎన్‌బీఎఫ్‌సీల ‘పసిడి’ నష్టాలు పరిమితం
పసిడి రుణాల విషయంలో ఎన్‌బీఎఫ్‌సీల నష్టాలు పరిమితంగా ఉన్నట్లు క్రిసిల్ పేర్కొంది. మహ మ్మారి వలన ఏర్పడిన రుణ నాణ్యత ఒత్తిడి సమయాల్లో, చరిత్రాత్మకంగా, బంగారు రుణ ఎన్‌బీఎఫ్‌సీలు తక్కువ నష్టాలను చూశాయని నివేదిక పేర్కొంది. నిర్దిష్ట కాలపరిమితిలో వడ్డీని స్వీకరించడం వల్ల లోన్–టు–వాల్యూ (ఎల్‌టీవీ) నిష్పత్తి కట్టడిలో ఉంటుందని పేర్కొన్న నివేదిక, సకాలంలో బంగారం వేలం వంటి బలమైన రిస్క్ మేనేజ్‌మెంట్ పద్ధతులనూ ఎన్‌బీఎఫ్‌సీలు అనుసరిస్తున్నాయని వివరించింది. రుణ పోర్ట్‌ఫోలియోలో క్రమశిక్షణ సౌలభ్యతతో పాటు, బంగారం ధరలో తీవ్ర మార్పుల వల్ల ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను తట్టుకుని నిలబడగలితే స్థితిని ఎల్‌టీవీ సృష్టిస్తుందని పేర్కొంది. 2020లో భారీగా పెరిగిన ధర ల తర్వాత, 2021 జనవరి–మార్చి మధ్య ధరలు తీవ్రంగా పడిపోయాయని ఈ పరిస్థితులన్నింటినీ ఎన్‌బీఎఫ్‌సీలు తట్టుకుని నిలబడ్డానికి కారణం లోన్–టు–వ్యాల్యూ నిష్పత్తితోపాటు, నిర్దిష్ట కాలంలో వడ్డీ వసూలు కారణమని పేర్కొంది. దీనికితోడు అవసరమైతే పసిడి రుణ వేలాలకు ఎన్‌బీఎఫ్‌సీలు వెనుకడుగు వేయడం లేదని నివేదిక వివరించింది. ఎన్‌బీఎఫ్‌సీలకు సంబంధించి పసిడి రుణ పోర్ట్‌ఫోలియో పటిష్టత కొనసాగుతుందన్న విశ్వాసాన్ని నివేదిక వ్యక్తం చేసింది.
చదవండి: స్థానికేతరులు, విదేశీ ఇన్వెస్టర్లకు ఊరట
బంగారం రుణాల్లో ఎన్‌బీఎఫ్‌సీల దూకుడు
Published Wed, Oct 13 2021 12:08 PM | Last Updated on Wed, Oct 13 2021 12:12 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment