కౌలు రైతులపై చావుదెబ్బ
కౌలు రైతులపై చావుదెబ్బ
Published Sat, Sep 17 2016 5:09 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
* బంగారు ఆభరణాలపై పరిమిత రుణం
* చిన్న, సన్నకారు, కౌలు రైతులకు పెద్ద కష్టం
* రైతుల రుణాలకు వడ్డీలోళ్లే దిక్కు..!
వ్యవసాయం చేసే రైతుల్లో అధిక శాతం కౌలు రైతులే. ప్రభుత్వం ఇచ్చే రుణాలు మాత్రం భూ యజమానులే తీసుకుంటారు. కౌలు రైతులకు ఏకైక దిక్కు గోల్డ్ లోన్లే... రైతులను దెబ్బ మీద దెబ్బ తీస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ఏకం గా చావుదెబ్బ కొట్టింది. బంగారంపై ఇచ్చే రుణాలకు కూడా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వర్తింపజేయాలని బ్యాంకులకు ఉచిత సలహా ఇచ్చింది. ఇక కౌలు రైతులు బయట అధిక వడ్డీలకు తెచ్చుకోవాల్సిందే.. తీరా అప్పులు తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడే దుస్థితి దాపురించే ప్రమాదం ఉంది.
తెనాలి: వివిధ పంటలకున్న రుణపరిమితి (స్కేల్ ఆఫ్ ఫైనాన్స్) ప్రకారమే బంగారంపై రుణాలివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో చేసిన సూచన రైతులను నట్టేట ముంచేలా వుంది. బంగారంపై పంటరుణాలకు రాష్ట్రానికి రాయితీ భారం లేకున్నా ఇలాంటి సూచన చేయడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి సూచన అమల్లోకి వస్తే చిన్న, సన్నకారు, కౌలు రైతులకు ఫైనాన్స్ సంస్థలు, వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పని పరిస్థితి నెలకొంటుంది.
మూడొంతుల మంది కౌలు రైతులే...
భూమి కలిగిన రైతులకు పంట రుణం ఇస్తున్నందున ప్రత్యేకించి కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వడం లేదనేది తెలిసిందే. వాస్తవానికి భూమి సాగుదారుల్లో 70–80 శాతం కౌలుదారులేనన్నది సుస్పష్టం. జిల్లాలో 2.50 లక్షల కౌలు రైతులున్నారు. చట్టప్రకారం కౌలురైతులు అందరికీ గుర్తింపు కార్డులనిచ్చి, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ (రుణపరిమితి) ప్రకారం పంట రుణం మంజూరు చేయాలి. జిల్లాలో దాదాపు 25–30 వేల మందికి రుణ అర్హత గుర్తింపు కార్డులనిచ్చారు. రైతుల గ్రూపులు ఏర్పాటుచేసి పంట రుణాలను నామమాత్రంగానే ఇస్తున్నారు. ‘మాకు తెలిసి కేవలం వెయ్యిమంది కౌలు రైతులక్కూడా రుణాలు అందిన దాఖలా లేదు’ అని రైతుసంఘం జిల్లా కార్యదర్శి వై.రాధాకృష్ణ ‘సాక్షి’తో చెప్పారు. దీంతో విధిలేని స్థితిలో అధికశాతం కౌలురైతులు తమకున్న బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి బ్యాంకుల్లో పంట రుణం తీసుకుంటున్నారు.పంట రుణం తీసుకున్న రైతులు కూడా సాగుకు సరిపోక అదనంగా అయ్యే ఖర్చుల కోసం బ్యాంకుల్లో బంగారం పెడుతున్నారు. గత రెండు ఖరీఫ్ సీజన్లలోనూ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులకు పెట్టుబడుల భారం అధికమైంది. నాలుగైదు ఎకరాల భూమి వున్న రైతుకు కూడా ఇల్లు కట్టుకోవాలన్నా, పిల్లలు చదువులకూ, పెళ్లిళ్లకూ, అనారోగ్యమొస్తే వైద్యఖర్చులకు బంగారం రుణం ఒక్కటే కొండంత భరోసా..! చంద్రబాబు నిర్ణయంతో ఇంట్లో బంగారం వుందన్న ధీమా ఇప్పడు సడలిపోయేలా వుందంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి భారం లేకపోయినా సరే...
పంటరుణాలకు రూ.3 లక్షల లోపు వడ్డీ రాయితీ ఉన్న విషయం తెలిసిందే. లక్ష రూపాయల వరకు పంట రుణానికి కేవలం ఏడు శాతం వడ్డీ వుంటుంది. సకాలంలో చెల్లిస్తే కేంద్రం 3 శాతం, రాష్ట్రప్రభుత్వం 4 శాతం రాయితీ ఇస్తాయి. రూ.3 లక్షలలోపు వుంటే ఏడు శాతం వడ్డీ వుంటుంది. ఇందులో కేంద్రం 3 శాతం, రాష్ట్రం 4 శాతం చెల్లించాల్సివుంటుంది. బంగారంపై పంటరుణం తీసుకుంటే రూ.3 లక్షల వరకు ఏడుశాతం వడ్డీ వుంటుంది. ఇందులో మూడు శాతాన్ని కేంద్రం రాయితీగా ఇస్తోంది. రాష్ట్రప్రభుత్వంపై ఎలాంటి భారం లేదు. అయినా ముఖ్యమంత్రి రైతుల ప్రయోజనాలకన్నా కేంద్ర ప్రభుత్వం మెప్పు కోసం చూస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
Advertisement