
ముంబై : ఆకాశాన్ని తాకుతున్న క్రూడ్ ఆయిల్ ధరలకు తోడు ఉక్రెయిన్ కేంద్రంగా రష్యా, నాటోల మధ్య తలెత్తిన ఉద్రిక్తలు.. ఏ క్షణమైనా యుద్ధం తప్పదనే వార్తల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు కుదైలవుతున్నాయి. ఈ క్రమంలో దేశీ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవి చూస్తున్నాయి. ఇన్వెస్టర్ల సంపద హారతి కర్పూరంగా కరిగిపోతుంది.
గత వారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 58,152 పాయింట్ల దగ్గర క్లోజయ్యింది. ఈ వారం కూడా లాభాలతో మార్కెట్లు మొదలవుతాయనే ఇన్వెస్టర్ల అంచనాలు తారుమారు అయ్యాయి. ఉదయం మార్కెట్ ప్రారంభం కావడమే నష్టాలతో మొదలైంది. దాదాపు వెయ్యి పాయింట్లకు పైగా కోల్పోయి 56,720 దగ్గర మొదలైంది. ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకునే అవకాశం కనిపించలేదు. సాయంత్రం 4 గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్ 1747 నష్టంతో 56,405 పాయింట్ల దగ్గర క్లోజయ్యింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 531 పాయింట్ల నష్టంతో 16,842 పాయింట్ల దగ్గర ముగిసింది. నిఫ్టీ 3.07 శాతం క్షీణత నమోదు చేసింది.
లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ అని తేడా లేకుండా అన్ని షేర్లు నష్టాల బాటలో ఉన్నాయి. గతేడాది నవంబర్ నుంచి మార్కెట్‌లో కరెక‌్షన్ కొనసాగుతుండగా తాజాగా వచ్చి పడ్డ ఉక్రెయిన్ ఉద్రిక్తతతో పరిస్థితి మరింతగా దిగజారింది. ఈ భారీ నష్టాలతో ఇన్వెస్టర్ల సంపద ఆవిరవుతోంది.