వ్యాపారాలను విభజించిన కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసిన వారి పంట పండుతోంది. ప్రత్యేక సంస్థలతో పాటు మాతృ సంస్థ ఉమ్మడి మార్కెట్ విలువలు రాకెట్‌లా దూసుకెళ్తూ దలాల్ స్ట్రీట్(Dalal Street)లో లాభాల మోత మోగిస్తున్నాయి. గత ఏడాది కాలంలో దాదాపు డజను కార్పొరేట్ సంస్థలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. తాజాగా ఐటీసీ(ITC) కూడా హోటళ్ల బిజినెస్‌ను విడదీసి ప్రత్యేక అనుబంధ సంస్థగా లిస్టింగ్ చేస్తోంది. అదేవిధంగా టాటా మోటార్స్ సైతం వాణిజ్య వాహన విభాగాన్ని విడదీసే పనిలో ఉంది.
విభిన్న వ్యాపారాలను ఒకే గొడుగు కింద నిర్వహించడం చాలా క్లిష్టతరమైన వ్యవహారం. దీనివల్ల నిర్దిష్టంగా ఫోకస్ చేయడానికి వీలుండదు. వేరు చేయడం వల్ల నిర్వహణ పనితీరు మెరుగవుతుంది. – రవి సర్దానా, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్
వ్యాపారాల పునర్‌వ్యవస్థీకరణ, ఇన్వెస్టర్లకు మరింత విలువ చేకూర్చడం ఇలా కారణం ఏదైనా కానీ.. దేశీ కార్పొరేట్ కంపెనీలు విభజనతో కాసులు కురిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఇలా విడదీసిన కంపెనీల షేర్లు దండిగానే లాభాలు పంచాయి. గత ఏడాది వ్యవధిలో విభజన తర్వాత మాతృ సంస్థ, కొత్తగా ఏర్పాటు చేసిన కంపెనీల ఉమ్మడి మార్కెట్(Market) విలువ 14–487% స్థాయిలో ఎగబాకడం విశేషం. ఎడెల్‌వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 2023 జూన్‌లో తన వెల్త్ బిజినెస్‌ను వేరు చేసి నువామా వెల్త్ మేనేజ్‌మెంట్ పేరుతో కొత్త కంపెనీని నెలకొల్పొంది. అప్పటి నుంచి ఈ రెండు సంస్థలూ బుల్లెట్‌లా దూసుకెళ్లాయి. ఉమ్మడి మార్కెట్ విలువ రూ.6,281 కోట్ల నుంచి తాజాగా రూ.36,900 కోట్లకు ఎగసింది. ఏకంగా 487 శాతం వృద్ధి చెందింది. నువామా గతేడాది సెపె్టంబర్‌లో లిస్టయింది. దీంతోపాటు షిప్పింగ్ కార్పొరేషన్, టీవీఎస్ హోల్డింగ్స్, ఎన్‌ఐఐటీ, జీహెచ్‌సీఎల్, ఫోర్బ్స్–కంపెనీ... ఈ సంస్థలు విభజన తర్వాత మార్కెట్ విలువను 50 శాతం పైగానే పెంచుకున్నాయి. రిలయన్స్ నుంచి జియో ఫైనాన్షియల్ విభజన తర్వాత ఇరు కంపెనీల మార్కెట్ విలువ ఒక దశలో 25 శాతం పైగా ఎగసింది.
మెరుగైన నిర్వహణ...
అధిక వృద్ధికి అవకాశం గల వ్యాపారాలను మాతృ సంస్థల నుంచి విడదీయడం వల్ల ఇన్వెస్టర్లకు కూడా మరింత విలువ చేకూరుతోంది. ‘విడదీసిన సంస్థల వ్యాపారాలు పుంజుకోవడం, స్వతంత్ర నిర్వహణ వల్ల ఆయా బిజినెస్‌లపై మరింత ఫోకస్ పెట్టేందుకు వీలవుతుంది. తగినంత నిధుల కేటాయింపు, పరిశ్రమ ట్రెండ్స్‌తో మెరుగ్గా అనుసంధానం కావడంతో భారీగా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది’ అని అవెండస్ క్యాపిటల్‌లో ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్స్ హెడ్ గౌరవ్ సూద్ పేర్కొన్నారు. దీనికి ప్రభుత్వ రంగ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చక్కని ఉదాహరణ. ఈ కంపెనీకి చెందిన నాన్–కోర్ బిజినెస్‌లు, రియల్ ఎస్టేట్ ఆస్తులను విడదీసి ఎస్‌సీఐ ల్యాండ్ అండ్ అసెట్స్ అనే సంస్థను ఏర్పాటు చేసింది. గతేడాది మార్చిలో ఇది లిస్టయింది. ఈ రెండు కంపెనీల ఉమ్మడి మార్కెట్ విలువ రూ.4,379 కోట్ల నుంచి రూ.12,829 కోట్లకు దూసుకెళ్లింది. అంటే 192% జంప్ చేసింది. ఇక టీవీఎస్(TVS) హోల్డింగ్స్ నుంచి సుందరమ్ క్లేటాన్ విభజన, దీన్ని ప్రత్యేక కంపెనీగా లిస్ట్ చేయడం వల్ల ఈ రెండింటి మార్కెట్ విలువ ప్రస్తుతం 136 శాతం ఎగబాకింది.
ఇదీ చదవండి: క్రెడిట్ కార్డు Vs ఛార్జ్ కార్డు.. ఏంటీ ఛార్జ్ కార్డు..
క్యూలో మరిన్ని కంపెనీలు...
ఐటీసీ, వేదాంత, హెచ్‌ఈజీ, అరవింద్, క్వెస్ కార్ప్ వంటి డజనకు పైగా కంపెనీలు ఇప్పటికే డీమెర్జర్లను ప్రకటించాయి. మరో 12–18 నెలల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యి.. వేరు చేసిన కంపెనీలు లిస్టవుతాయి. దీంతో అటు ఇన్వెస్టర్లతో పాటు ఇటు ఆయా కంపెనీలకూ మరింత విలువ దక్కనుంది. ఐటీసీ హోటల్ వ్యాపారాన్ని విడదీస్తున్నట్లు గతేడాది ఆగస్ట్‌లో ప్రకటించడం తెలిపిందే. వాటాదారులకు ప్రతి 10 ఐటీసీ షేర్లకు 1 ఐటీసీ హోటల్స్ షేర్లు దక్కుతాయి. దీనికి రికార్డ్ తేదీ జనవరి 6 కాగా త్వరలో లిస్టింగ్ జరగనుంది. వేదాంత సైతం 5 కీలక వ్యాపారాలను (అల్యూమినియం, ఆయిల్–గ్యాస్ విద్యుత్, స్టీల్, ఫెర్రస్ మెటీరియల్స్) వేర్వేరు కంపెనీలుగా విడదీయనున్నట్లు 2023 సెప్టెంబర్‌లో తెలిపింది. కొత్తగా ఏర్పాటు చేసిన వ్యాపారాలు, జింక్ మాత్రం వేదాంత కింద ఉంటాయి. ఇక టాటా మోటార్స్ కూడా తన వాణిజ్య వాహన విభాగాన్ని విడదీసి ప్రత్యేక కంపెనీగా లిస్ట్ చేయనుంది. ప్యాసింజర్ వాహన విభాగం ఇప్పుడున్న లిస్టెడ్ కంపెనీ పేరుతోనే కొనసాగనుంది.
Comments
Please login to add a commentAdd a comment