ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో దేశీ ఫార్మా రంగ దిగ్గజం దివీస్ ల్యాబొరేటరీస్, గ్లోబల్ కంపెనీ అబాట్ ఇండియా ఆకర్షణీయ ఫలితాలు సాధించాయి. ఈ రెండు కంపెనీల ఫలితాలు తాజాగా వెల్లడికావడంతో సోమవారం ట్రేడింగ్‌లో అటు దివీస్ ల్యాబ్, ఇటు అబాట్ ఇండియా కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకునే వీలున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇతర వివరాలు చూద్దాం..
దివీస్ ల్యాబొరేటరీస్
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో దివీస్ ల్యాబ్ ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించింది. నికర లాభం దాదాపు 81 శాతం దూసుకెళ్లి రూ. 492 కోట్లను తాకింది. గతేడాది(2019-20) క్యూ1లో రూ. 272 కోట్లు మాత్రమే ఆర్జించింది. కాగా.. మొత్తం ఆదాయం సైతం రూ. 1193 కోట్ల నుంచి రూ. 1748 కోట్లకు ఎగసింది. ఇది 46 శాతం వృద్ధికాగా.. కోవిడ్-19 కాలంలోనూ దాదాపు సాధారణ స్థాయిలో కార్యకలాపాలను నిర్వహించగలిగినట్లు ఫలితాల విడుదల సందర్భంగా కంపెనీ తెలియజేసింది. శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో దివీస్ ల్యాబ్ షేరు 2.3 శాతం బలపడి రూ. 2800 వద్ద ముగిసింది.
అబాట్ ఇండియా
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో అబాట్ ఇండియా ఆసక్తికర ఫలితాలు సాధించింది. నికర లాభం 54 శాతం జంప్‌చేసి రూ. 180 కోట్లను అధిగమించింది. గతేడాది(2019-20) క్యూ1లో ఆర్జన రూ. 117 కోట్లు మాత్రమే. ఇదే కాలంలో మొత్తం ఆదాయం సైతం రూ. 999 కోట్ల నుంచి రూ. 1064 కోట్లకు పెరిగింది. శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో అబాట్ ఇండియా షేరు స్వల్పంగా 0.6 శాతం లాభపడి రూ. 16,254 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment