
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ రంగ సంస్థ దివీస్ ల్యాబొరేటరీస్ మరో ప్లాంటును నెలకొల్పుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలో ఉన్న తొండంగి మండలం ఒంటిమామిడి గ్రామం వద్ద ఇది ఏర్పాటు కానుంది. యూనిట్–3 ఫెసిలిటీ కోసం రూ.1,500 కోట్లు పెట్టుబడి చేయనున్నట్టు కంపెనీ మంగళవారం ప్రకటించింది. డిసెంబర్ 7న నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్టు తెలిపింది. అంతర్గత వనరులను దశలవారీగా ఈ కేంద్రం కోసం వెచ్చించనున్నట్టు వెల్లడించింది. ప్రాజెక్టులో తొలి దశ కార్యకలాపాలు 12-18 నెలల్లో మొదలుకానున్నాయి. తయారీ ప్లాంటు ఏర్పాటుకు కావాల్సిన లైసెన్సులను కేంద్ర ప్రభుత్వంతోపాటు ఆంధ్రప్రదేశ్ నుంచి అందుకున్నట్టు దివీస్ వెల్లడించింది. కాగా, మంగళవారం కంపెనీ షేరు ధర 0.36% ఎగసి రూ.3,620.50 వద్ద స్థిరపడింది.
Comments
Please login to add a commentAdd a comment