న్యూఢిల్లీ: రుతుపవనాలు కొంత అస్థిరంగా ఉన్నప్పటికీ భారతదేశ ఆర్థిక పురోగమనం యథాతథంగా కొనసాగుతోందని ఆర్థిక మంత్రిత్వ శాఖ జూలై నెలవారీ నివేదిక తెలిపింది. ఆర్థిక సర్వే అంచనాలకు అనుగుణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 6.5 శాతం నుంచి 7 శాతం శ్రేణిలోనే నమోదవుతుందన్న ధీమాను వ్యక్తం చేసింది.
ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత 2024–25 ఆర్థిక సంవత్సరం గడచిన నాలుగు నెలల్లో ఎకానమీ పురోగమనం సంతృప్తికరంగా ఉందని పేర్కొంది. ప్రత్యేకించి వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు (రూ.7.39 లక్షల కోట్లు) పూర్తి సానుకూల నమోదుకావడం హర్షణీయ పరిణామమని అభిప్రాయపడింది. తయారీ, సేవల రంగాలు సైతం పురోగతి బాటలో ఉన్నాయని వివరించింది. తాజా 2024–25 బడ్జెట్ దేశ ద్రవ్య, ఆర్థిక పటిష్టతకు బాటలు వేస్తుందని భరోసాను ఇచ్చింది.
ద్రవ్యోల్బణం కట్టడి (ఐదేళ్ల కనిష్ట స్థాయిలో జూలైలో 3.4 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం నమోదు) సానుకూల అంశంగా వివరించింది. రిజర్వాయర్‌లో నీటి మట్టాలు భారీగా పెరగడం వల్ల ప్రస్తుత ఖరీఫ్, రాబోయే రబీ పంటల ఉత్పత్తి విషయంలో మంచి ఫలితాలు ఉంటాయని పేర్కొన్న నివేదిక, రాబోయే నెలల్లో ఆహార ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంలో ఈ పరిణామం మరింత దోహదపడుతుందని విశ్లేషించింది.
Comments
Please login to add a commentAdd a comment