
డాబర్ ఇండియా ఛైర్మన్ మోహిత్ బర్మన్‌తో పాటు కేర్ హెల్త్ ఇన్సూరెన్స్‌కు చెందిన ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్లకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు ఈడీ తెలిపింది. రెలిగేర్ ఎంటర్‌ప్రైజ్ లిమిటెడ్ షేర్ హోల్డర్ వైభవ్‌గావ్లీ చేసిన ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్నట్లు పేర్కొంది.
బర్మన్ కుటుంబానికి చెందిన డాబర్ సంస్థలోని కొన్ని షేర్లను గతంలో ఓపెన్ ఆఫర్ కింద విక్రయించారు. అందులో రెలిగేర్ లిమిటెడ్ షేర్ హోల్డర్లు పాల్గొన్నారు. రెలిగేర్ గ్రూప్‌లోని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అయిన రెలిగేర్ ఫిన్‌వెస్ట్ నుంచి నిధులు సమీకరించారు. అనంతరం డాబర్ సంస్థ ఓపెన్ ఆఫర్‌తో అనుసంధానం అయిన ఇతర కంపెనీలకు ఆ డబ్బును చేరవేసింది.
ఇదీ చదవండి: రూపాయి 78 ఏళ్ల ప్రస్థానం..
ఇదిలాఉండగా, ఓపెన్ ఆఫర్ సమయంలో బర్మన్ కుటుంబానికి సంబంధించి సరైన వాటాను తెలియజేయకుండా తప్పుడు సమాచారం అందించారని రెలిగేర్ షేర్‌హోల్డర్ వైభవ్ గావ్లీ ఫిర్యాదు చేశారు. కంపెనీ నష్టాలను పూర్తిగా వెల్లడించలేదని చెప్పారు. వాటాల టెండర్‌లో మనీలాండరింగ్ జరిగిందన్నారు. ఓపెన్ ఆఫర్ ప్రకటించిన తర్వాత షేర్లను కొనుగోలు చేసిన వాటాదారులకు ఆర్థిక నష్టాలు ఎదురవుతున్నాయని ఫిర్యాదులో ఆరోపించారు. ప్రాథమిక చర్యలో భాగంగా ఈడీ ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న డాబర్ ఇండియా ఛైర్మన్ మోహిత్ బర్మన్‌తో పాటు కేర్ హెల్త్ ఇన్సూరెన్స్‌కు చెందిన ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్లు, ఓపెన్ ఆఫర్ మేనేజర్‌కు సమన్లు జారీ చేసింది. అయితే కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ అధికారుల పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment