మీరు ఎక్కువగా బ్యాంకు సంబంధిత లావాదేవీలు చేస్తుంటారా? అయితే, మీకు ఒక ముఖ్య గమనిక. ఆగస్టు 1 నుంచి బ్యాంకుకు సంబంధించిన కొత్త నిబందనలు అమలులోకి రానున్నాయి. ఈ కొత్త నిబంధనల వల్ల సామాన్యుల మీద ఎక్కవగా భారం పడనుంది. ఏటీఎం లావాదేవీలు, ఎల్‌పీజీ ధరలు, వేతనాలు, పెన్షన్లు ఇలా చాలా అంశాలకు సంబంధించి కొత్త మార్పులు ఆగస్టు 1 నుంచి చోటు చేసుకొనున్నాయి. సాధారణంగా ప్రతీ నెల ప్రారంభంలో కొత్త నిబందనలు అమల్లోకి వస్తుంటాయి. మరి ఆగస్టు 1 నుంచి అమలులోకి రానున్న కొత్త రూల్స్ ఏంటీ? అవి మిమ్మల్ని ఏ విధంగా ప్రభావితం చేయనున్నయో? తెలుసుకోండి.
వేతనం, ఈఎమ్ఐ చెల్లింపులు: నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్(ఎన్ఏసీహెచ్) నిబంధనలలో ఆర్‌బీఐ మార్పు చేయడం వల్ల సెలవు రోజుల్లో కూడా విద్యుత్, గ్యాస్, టెలిఫోన్, నీరు, జీతం, మ్యూచువల్ ఫండ్స్, పెన్షన్ సంబంధిత లావాదేవీలు సెలవు రోజుల్లో కూడా జరగనున్నాయి. ఈ కొత్త మార్పులు ఆగస్టు 1, 2021 నుంచి అమల్లోకి వస్తాయి. రియల్ టైమ్ గ్రాస్ సెటిల్ మెంట్(ఆర్ టీజిఎస్), ఎన్ఏసిహెచ్ సేవలు 24ఎక్స్7 అందుబాటులో ఉంటాయని ఆర్‌బీఐ పేర్కొంది. ఎన్ఏసీహెచ్ అనేది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్ పీసీఐ) చేత నిర్వహించబడుతుంది.
ఎటిఎమ్ క్యాష్ విత్ డ్రా: జూన్ నెలలో ఆర్‌బీఐ తీసుకొచ్చిన మరో ఆర్డర్ ప్రకారం, ఆగస్టు 1 నుంచి ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్స్(ఏటీఎం) చార్జీలు పెరగనున్నాయి. ఏటీఎం కేంద్రాల నిర్వహణ భారంగా మారిందన్న బ్యాంక్ ఆందోళన నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ఇంటర్ చేంజ్ ఫీజ్ ను ₹2 పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. తాజాగా వచ్చే ఆగస్టు 1 నుంచి ఏటీఎం కేంద్రాల్లోనూ ఒక్కో ఆర్ధిక లావాదేవీపై ఇంటర్ ఛేంజ్ ఫీజు రూ.15 నుంచి రూ.17కు, ఆర్ధికేతర లావాదేవీలపై రూ.5 నుంచి రూ.6కు పెరగనుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు చెందిన డెబిట్ కార్డులు 90 కోట్ల వరకు వాడుకలో ఉన్నాయి.
ఐపీపీబీ డోర్ స్టెప్ సేవలు ఖరీదు: ఇప్పటి వరకు ఉచితంగా అందిస్తున్న ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ డోర్ స్టెప్ సేవలకు ఇక నుంచి ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. డోర్ స్టెప్ బ్యాంకింగ్ ఛార్జీలను, సేవింగ్స్ అకౌంట్ల వడ్డీ రేట్లను ఐపీపీబీ సవరించింది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ డోర్ స్టెప్ బ్యాంకింగ్ ఛార్జీలు 01 ఆగస్టు 2021 నుంచి వర్తిస్తాయి. ప్రస్తుతం, డోర్ స్టెప్ బ్యాంకింగ్ సంబంధించి ఎలాంటి ఛార్జీలు లేవు. ఇక ఆగస్టు 1, 2021 నుంచి ప్రతి కస్టమర్ ఐపీపీబీ డోర్ స్టెప్ అభ్యర్థనకు బ్యాంకింగ్ ఛార్జీల కింద రూ.20 + జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఒకే కస్టమర్ ఎక్కువ సార్లు అభ్యర్థనలు చేయడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
ఐసీఐసీఐ బ్యాంక్ సర్వీస్ ఛార్జీలు: భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంకు ఐసీఐసీఐ తన దేశీయ పొదుపు ఖాతాదారులకు నగదు లావాదేవీలు, ఎటిఎం ఇంటర్ చేంజ్, చెక్ బుక్ ఛార్జీల సవరించిన్నట్లు తెలిపింది. ఈ మార్పులు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ వెబ్ సైట్ తెలిపింది. అన్ని నగదు లావాదేవీలపై ఛార్జీల సవరణ వర్తిస్తుంది.ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలలో నెలకు మొత్తం 4 ఉచిత నగదు లావాదేవీలను అనుమతించింది. ఆ తర్వాత లావాదేవీలకు ఛార్జీలు వర్తిస్తాయి.ప్రతి ఆర్థిక లావాదేవీకి బ్యాంకు ₹20, ఆర్థికేతర లావాదేవీకి ₹8.50 వసూలు చేస్తుంది. ఆగస్టు 1 నుంచి ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారుల హోమ్ బ్రాంచీలో నగదు లావాదేవీ పరిమితి నెలకు రూ.1 లక్ష వరకు ఉచితం. లక్షకు పైగా జరిపే ప్రతి లావాదేవిపై ₹1,000కు ₹5 చెల్లించాలి. కనీస రుసుము ₹150గా ఉంది.
ఎల్‌పీజీ ధరలు: ఎల్‌పీజీ ధరలను గ్యాస్ ఏజెన్సీలు ప్రతి నెల ఒకటో తేదీన సవరిస్తాయి. జూలై నెల 1 తేదీన ఎల్‌పీజీ ధరలను రూ. 26 పెంచాయి. మరి ఈ నెల పెరగనున్నాయా? తగ్గనున్నాయా? అనేది ఆగస్టు 1 తేదీన తెలవనుంది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ): 15సీఏ, 15సీబీ ఫామ్స్ ఎలక్ట్రానిక్ ఫైలింగ్ విషయంలో పలు సడలింపులు ఇచ్చింది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. గతంలో జూలై 15 వరకు ఉన్న చివరి తేదీని ఆగస్ట్ 15కి పొడిగించింది.
Comments
Please login to add a commentAdd a comment