
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పరమైన ప్రతికూల పరిస్థితులను అధిగమించి, చిన్న సంస్థలు (ఎస్‌ఎంబీ) తమ వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు అవసరమైన తోడ్పాటునివ్వనున్నట్లు సోషల్ మీడియా సంస్థ ఫేస్‌బుక్ వెల్లడించింది. అయిదు నగరాల్లోని (హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, గుర్గావ్, ముంబై, బెంగళూరు) 3,000 పైచిలుకు చిన్న వ్యాపారాలకు 4.3 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 32 కోట్లు) మేర గ్రాంట్ ఇనవ్వనున్నట్లు ఫేస్‌బుక్ ఇండియా ఎండీ అజిత్ మోహన్ ఒక బ్లాగ్‌పోస్టులో తెలిపారు.
సింహభాగం నగదు రూపంలోను మిగతాది యాడ్ క్రెడిట్స్ రూపంలో ఉంటుందని పేర్కొన్నారు. అన్ని రకాల వ్యాపారాలకు ఇది వర్తిస్తుందని, ఫేస్‌బుక్‌కు సంబంధించిన సాధనాలేమీ వాడని సంస్థలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని వివరిం చారు. గ్రాంటు ద్వారా పొందిన నిధుల వినియోగంపై ఎలాంటి షరతులు ఉండవని, ఆయా సంస్థలు తమకు కావాల్సిన విధంగా వినియోగించుకోవచ్చన్నారు. 2020 జనవరి 1 నాటికి కనీసం 2 నుంచి 50 మంది సిబ్బంది ఉన్న సంస్థలు దీనికోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన సంస్థలకు సుమారు రూ. 63,000 నగదు, రూ. 38,000 విలువ చేసే ఫేస్‌బుక్ యాడ్ క్రెడిట్స్ లభిస్తాయి.