Reduce GST Rates On Two-Wheelers From 28% To 18%, FADA Appeals To GST Council - Sakshi
Sakshi News home page

ద్విచక్ర వాహనదారులకు ఊరట?..టూవీలర్లపై జీఎస్టీ తగ్గనుందా?

Published Fri, May 19 2023 7:47 AM | Last Updated on Fri, May 19 2023 9:28 AM

 Fada Has Urged The Gst Council To Reduce The Gst Rate On Two Wheelers - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ద్విచక్ర వాహనాలపై జీఎస్టీని ప్రస్తుతం ఉన్న 28 నుంచి 18 శాతానికి తగ్గించాలని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్స్‌ (ఎఫ్‌ఏడీఏ) ప్రభుత్వానికి విన్నవించింది. లక్షలాది మందికి అవసరమైన ఈ విభాగాన్ని లగ్జరీ వస్తువుగా వర్గీకరించకూడదని పేర్కొంది. ఆర్థిక మంత్రి, జీఎస్టీ కౌన్సిల్‌ ఛైర్మన్‌ నిర్మలా సీతారామన్, జీఎస్టీ కౌన్సిల్‌ సభ్యులు, ఆటోమొబైల్‌ రంగాన్ని పర్యవేక్షిస్తున్న భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ, రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖకు ఈ మేరకు విజ్ఞప్తి చేసినట్లు ఫెడరేషన్‌ తెలిపింది.

‘ఈ సమయానుకూల, నిర్ణయాత్మక జోక్యం వల్ల ద్విచక్ర వాహనాలను మరింత సరసమైనవిగా చేయడంలో, డిమాండ్‌ను పునరుద్ధరించడంలో తోడ్పడుతుంది. గత కొన్నేళ్లుగా విక్రయాలలో గణనీయమైన తిరోగమనాన్ని చవిచూసిన పరిశ్రమను గాడిలో పెట్టేందుకు సాయపడుతుంది’ అని వివరించింది.  

తక్కువ ఖర్చుతో రవాణా.. 
‘ద్విచక్ర వాహన పరిశ్రమ క్లిష్ట దశలో ఉంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, కఠిన ఉద్గార నిబంధనలు, కోవిడ్‌–19 అనంతర ప్రభావాలు వంటి సవాళ్లతో పోరాడుతోంది. ద్విచక్ర వాహనాలపై జీఎస్టీ రేటును తగ్గించి సామాన్యులకు మరింత అందుబాటులోకి తెచ్చేందుకు జీఎస్టీ కౌన్సిల్‌కు ఇది సరైన తరుణం. పన్ను తగ్గింపు పరిశ్రమకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ఉపాధి అవకాశాలను సృష్టించడంలో, దేశ మొత్తం ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది.

అధిక జనాభాకు తక్కువ ఖర్చుతో ప్రయాణాలు చేసే విషయంలో ద్విచక్ర వాహనాలు కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా ప్రజా రవాణా తక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఇవి విస్తరించాల్సి ఉంది. కొన్నేళ్లుగా వివిధ ద్విచక్ర వాహనాల ధరలు గణనీయంగా పెరిగాయి.  వినియోగదారులకు కొనుగోలు శక్తిపై ప్రభావం చూపుతోంది. ముడి పదార్థాల ధరలు పెరగడం, కఠినమైన ఉద్గార నిబంధనలు, అధిక పన్నులు, రుసుములతో సహా అనేక కారణాలు ఈ పెరుగుదలకు కారణం’ అని ఎఫ్‌ఏడీఏ తెలిపింది.  

తగ్గిన టూవీర్ల వాటా.. 
హోండా యాక్టివా ధర 2016లో రూ.52,000లు పలి కింది. 2023లో రూ.88,000లకు చేరింది. బజాజ్‌ పల్సర్‌ ధర 2016లో రూ.72,000 ఉంటే ఇప్పు డది రూ.1.5 లక్షలకు ఎగసింది. ద్విచక్ర వాహనాల ధరలలో నిరంతర పెరుగుదల తత్ఫలితంగా అమ్మకాల క్షీణతకు దారితీసింది. పరిశ్రమ వృద్ధి పథాన్ని పునరుద్ధరించడానికి జోక్యం అవసరం. జీఎస్టీ రేటు తగ్గింపు అత్యవసర అవసరాన్ని గు ర్తు చేస్తోంది.

2016లో భారత్‌లో జరిగిన మొత్తం ఆటోమొబైల్‌ విక్రయాలలో ద్విచక్ర వాహనాల వాటా ఏకంగా 78% ఉంది. 2020 నుండి నిరంతర ధరల పెరుగుదల కారణంగా టూవీలర్ల వాటా 2022–23లో 72%కి పడిపోయింది. ఇది ధరల పెరుగుదల ప్రభావాన్ని నొక్కి చెబుతోంది. జీఎస్టీ రేటును తగ్గించడం వల్ల ఇతర రవాణా విధానాల తో పోలిస్తే ద్విచక్ర వాహనాల పోటీతత్వం పెరుగుతుంది. తద్వారా పరిశ్రమకు అమ్మకాలతోపాటు ఆదాయం అధికం అవుతుంది’ అని ఫెడరేషన్‌ ప్రెసి డెంట్‌ మనీష్‌ రాజ్‌ సింఘానియా వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement