ప్యాకేజీపై ఆశలు- వాల్ స్ట్రీట్ ప్లస్ | Fed status quo policy- US markets up | Sakshi
Sakshi News home page

ప్యాకేజీపై ఆశలు- వాల్ స్ట్రీట్ ప్లస్

Published Fri, Nov 6 2020 10:01 AM | Last Updated on Fri, Nov 6 2020 10:03 AM

Fed status quo policy- US markets up - Sakshi

న్యూయార్క్: ఫెడరల్ రిజర్వ్ యథాతథ పాలసీ, జో బైడెన్‌కు ఆధిక్యంపై అంచనాల నేపథ్యంలో గురువారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు పుంజుకున్నాయి. డోజోన్స్‌ 543 పాయింట్లు(2 శాతం) జంప్‌చేసి 28,390కు చేరగా.. ఎస్‌అండ్‌పీ 67 పాయింట్లు(2 శాతం) ఎగసి 3,510 వద్ద ముగిసింది. నాస్‌డాక్‌ సైతం 300 పాయింట్లు(2.6 శాతం) దూసుకెళ్లి 11,891 వద్ద స్థిరపడింది. వెరసి వరుసగా నాలుగో రోజు మార్కెట్లు ర్యాలీ చేశాయి. ఈ వారం ఇప్పటివరకూ ఎస్‌అండ్‌పీ 7 శాతం లాభపడింది.

ఫెడ్ పాలసీ
తాజా పాలసీ సమీక్షలో భాగంగా ఫెడరల్ రిజర్వ్ యథాతథ రేట్ల అమలుకే కట్టుబడింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు 0-0.25 శాతం మధ్య కొనసాగనున్నాయి. అయితే కోవిడ్-19 కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగమనంలోనే కదులుతున్నట్లు ఫెడ్ పేర్కొంది. ఆర్థిక పురోగతికి దన్నుగా మరింత స్టిములస్(సహాయక ప్యాకేజీలు) అందించవలసి ఉన్నట్లు అభిప్రాయపడింది. ఇందుకు వీలుగా సరళతర విధానాలతో మద్దతు ఇవ్వవలసి ఉన్నట్లు సంకేతాలిచ్చింది. అయితే ప్రస్తుత సమీక్షలో వీటి ప్రస్తావన లేకపోవడం గమనార్హం.  

ప్యాకేజీ అంచనాలు
ప్రెసిడెంట్ పదవి రేసులో డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌కు కొన్ని కీలక రాష్ట్రాలలో ఆధిక్యం లభించనున్న అంచనాలు బలపడుతున్నాయి. మరోపక్క సెనేట్ లో రిపబ్లికన్లకు తిరిగి ఆధిక్యం లభించనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ పురోగతికి కనీసం ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీకి కొత్త ప్రభుత్వం ఆమోదముద్ర వేయవచ్చని నిపుణులు భావిస్తున్నారు. దీంతో స్టాక్ మార్కెట్లు, డాలరు బలపడుతున్నట్లు తెలియజేశారు. 

ఫాంగ్ స్టాక్స్ జూమ్
వచ్చే ఏడాది 5జీ స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు పెరగనున్న అంచనాలతో చిప్ తయారీ కంపెనీ క్వాల్ కామ్ షేరు 13 శాతం దూసుకెళ్లింది. ఇక ఫాంగ్‌ స్టాక్స్‌గా పిలిచే టెక్‌ దిగ్గజాలలో యాపిల్‌ 3.5 శాతం, నెట్‌ఫ్లిక్స్‌ 3.4 శాతం, మైక్రోసాఫ్ట్‌ 3.2 శాతం, అమెజాన్‌, ఫేస్‌బుక్‌ 2.5 శాతం మధ్య ఎగశాయి. అల్ఫాబెట్‌ 1 శాతం పుంజుకుంది. ఎలక్ట్రిక్‌ కార్ల కంపెనీ టెస్లా ఇంక్‌ సైతం 4 శాతం జంప్‌చేసింది. ఇతర బ్లూచిప్స్‌లో బోయింగ్‌ 3.6 శాతం, మోడర్నా ఇంక్‌, ఫైజర్ 2.4 శాతం చొప్పున లాభపడ్డాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement