పండగ సీజన్‌: తగ్గేదేలే అంటున్న కంపెనీలు, పుల్‌ జోష్‌లో ఆ రంగం! | Festival Season Brings Cheer To Ads Industry Gain Huge Profits | Sakshi
Sakshi News home page

పండగ సీజన్‌: తగ్గేదేలే అంటున్న కంపెనీలు, పుల్‌ జోష్‌లో ఆ రంగం!

Published Wed, Oct 19 2022 9:16 AM | Last Updated on Wed, Oct 19 2022 11:18 AM

Festival Season Brings Cheer To Ads Industry Gain Huge Profits - Sakshi

న్యూఢిల్లీ: పండుగల సీజన్‌ కావడంతో కంపెనీలు ప్రకటనలను హోరెత్తిస్తున్నాయి. వినియోగ డిమాండ్‌ను అనుకూలంగా మలుచుకునేందకు తమ ఉత్పత్తులకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రకటనలు ఇస్తున్నాయి. ఈ కామర్స్, ఫ్యాషన్, అప్పారెల్, ఖరీదైన ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల కంపెనీలు ఈ పండుగల సీజన్‌ కోసం తమ ప్రకటనల బడ్జెట్‌ను 15–20 శాతం పెంచాయి. దీన్నిబట్టి కంపెనీలు విక్రయాలకు సంబంధించి నిర్ధేశించుకున్న లక్ష్యాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. దసరా నుంచి పండుగల సీజన్‌ మొదలు కాగా, ఇప్పటికే ఈ విభాగాల్లో విక్రయాలు అంచనాలను మించాయి.

దీంతో కంపెనీలు సైతం తగ్గేదేలా అంటూ ప్రకటనలకు మరింత ఖర్చు చేస్తున్నాయి. ‘‘ఈ కామర్స్, అప్పారెల్, ఫ్యాషన్, ప్రీమియం ఎలక్ట్రానిక్స్, మొబైల్‌ ఫోన్లు, బ్యూటీ, వెల్‌నెస్‌ ఉత్పత్తులు, వినోద, జ్యుయలరీ సంస్థలు అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసికం కోసం తమ ప్రకటనల బడ్జెట్‌ను (నిధుల కేటాయింపులు) 15–20 శాతం పెంచాయి. పండుగల డిమాండ్‌కు అనుకూలంగానే ఇది ఉంది. ఈ కేటగిరీల్లో ఇప్పటి వరకు విక్రయాలు లక్ష్యాలను మించి నమోదయ్యాయి’’అని మీడియా టెక్నాలజీ స్టార్టప్‌ ఆర్‌డీ అండ్‌ఎక్స్‌ నెట్‌వర్క్‌ చైర్మన్‌ ఆశిష్‌ భాసిన్‌ తెలిపారు. ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ విభాగంలో మాత్రం ప్రకటనల పరంగా ఆచితూచి అనుసరించే ధోరణి ఉన్నట్టు చెప్పారు.  

ఇక ముందూ కొనసాగొచ్చు.. 
పండుగల సమయాల్లో వినియోగదారులు కొనుగోళ్లకు మొగ్గు చూపిస్తుంటారు. గత రెండు సంవత్సరాల్లో కరోనా ప్రభావం కొనుగోళ్ల డిమాండ్‌పై చూపించింది. కానీ, ఈ ఏడాది వైరస్‌ ప్రభావం ఏమీ లేదు. సాధారణ ఆర్థిక కార్యకలాపాల మద్దతుతో వినియోగ డిమాండ్‌ పట్టణాల్లో బలంగానే ఉంది. దీంతో విక్రయాలు గణనీయంగానే నమోదవుతున్నాయి. దీపావళి వరకు ఈ కొనుగోళ్లు జోరుగా ఉంటాయని జాన్‌రైజ్‌ అడ్వర్టైజింగ్, బ్రాండింగ్‌ డైరెక్టర్‌ సుమన్‌ గద్దె తెలిపారు. ఆ తర్వాత పండుగల సీజన్‌ కూడా కలిసొస్తుందని అన్నారు. విస్తృత స్థాయిలో ఉత్పత్తులు, వాటిపై ఆఫర్లను ఈ సీజన్‌లో అందిస్తున్నట్టు ఎల్‌జీ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ దీపక్‌ బన్సాల్‌ తెలిపారు. డ్యూరబుల్స్, ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తులకు మంచి డిమాండ్‌ ఉన్నట్టు చెప్పారు. అన్ని మాధ్యమాల్లో తమ ఉత్పత్తులకు సంబంధించి విస్తృతమైన ప్రచారం చేపట్టినట్టు వెల్లడించారు.  

ఈ సీజన్‌లో ఎక్కువే.. 
‘‘మా జ్యుయలరీ బ్రాండ్లు తనిష్క్, మియా, జోయ, కార్ట్‌లేన్‌కు సంబంధించి ప్రకటనలపై చేసే ఖర్చు గతేడాది ఇదే సీజన్‌తో పోలిస్తే ఈ సీజన్‌లో పెరిగింది’’అని టాటా గ్రూపు కంపెనీ టైటాన్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అజయ్‌ చావ్లా తెలిపారు. ఎగువ మధ్య తరగతి, ఖరీదైన విభాగాల్లో వినియోగదారుల ఆసక్తి పెరిగినట్టు చెప్పారు. దీంతో మరింత మంది కస్టమర్లను ఆకర్షించడం ద్వారా, మెరుగైన వృద్ధి అంచనాలను చేరుకునే లక్ష్యంతో ఉన్నట్టు తెలిపారు. విచక్షణారహిత వినియోగ విభాగంలో ఇప్పటి వరకు డిమాండ్‌ బలంగా ఉన్నట్టు పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఇది ప్రకటనలపై అధిక వ్యయాలకు మద్దతునిస్తున్నట్టు చెప్పాయి. ఫ్రెంచ్‌ అప్పారెల్‌ బ్రాండ్‌ సెలియో సీఈవో సత్యేన్‌ మొమాయ మాట్లాడుతూ.. దసరా సమయంలో పెట్టుబడులపై మంచి రాబడులు రావడంతో ప్రకటనల బడ్జెట్‌ను 25 శాతం పెంచినట్టు ఈ సందర్భంగా తెలిపారు. 

చదవండి: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌: ఊహించని షాక్‌.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement