LinkedIn: Finance professional Jessica Hanzie Leonard Horrible TATOO Story - Sakshi
Sakshi News home page

పచ్చబొట్లే ఆ బిజినెస్‌ విమన్‌ పాలిట శాపం! కానీ ఇప్పుడు..

Published Thu, Dec 30 2021 1:48 PM | Last Updated on Thu, Dec 30 2021 2:07 PM

Finance professional Jessica Hanzie Leonard Horrible TATOO Story In LinkedIn - Sakshi

అన్ని రంగాల్లో మగవాళ్లతో సమానంగా మహిళలు రాణిస్తున్నా.. పూర్తి సమానత్వం ఇంకా రాలేదు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం ఇప్పటికీ కొన్ని విషయాల్లో పాత పద్దతులు పాటించడాన్నే సమర్థిస్తున్నారు. కొత్తగా ఎవరైనా ప్రయత్నిస్తే విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. ఇలాంటి విమర్శలు, సూటిపోటీ మాటలతో ఇబ్బంది పడుతున్న ఓ బిజినెస్‌ విమన్‌ ఇటీవల వాటి నుంచి విముక్తి పొందింది. తన జీవితంలో ఎదురైన అనుభవాలను ఇటీవల ఆమె తన లింక్డ్‌ఇన్‌లో పంచుకుంది. ఆమెకు ఎదురైన అనుభవాలు, వర్క్‌ప్లేస్‌లో కల్చర్‌ తదితర అంశాలు ఇప్పుడు బిజినెస్‌ వరల్డ్‌లో చర్చనీయాంశంగా మారాయి. 

అమెరికాలోని ప్రైవేట్‌ ఈక్విటీ ఫండ్‌ మేనేజింగ్‌ కంపెనీల్లో ఒకటైన ఎవల్యూషన్‌ క్యాపిటల్‌ పార్టనర్‌ సంస్థలో జెస్సికా హాంజీ లియోనార్డ్‌ అనే మహిళ ఇటీవల భాగస్వామిగా చేరింది. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన వివరాలను ఆ సంస్థ వెబ్‌సైట్లో అప్‌లోడ్‌ చేయాల్సి వచ్చింది. దీంతో ఎంతో బెరుకుగా ఆమె వాళ్ల బాస్‌ రూమ్‌లోకి అడుగు పెట్టింది.

టాటాల చుట్టే విమర్శలు
జెస్సికా హాంజీ లియోనార్డ్‌కి పచ్చబొట్లు (టాటూస్‌) అంటే ఇష్టం. మణికట్టు నుంచి భుజాలు, మెడ వరకు అనేక డిజైన్లలో పచ్చబొట్లు వేయించుకుంది. అయితే బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్‌ హోదాలో అలా పచ్చబొట్లు పొడిపించుకున్నందుకు ఆమెకు తోటి ఉద్యోగుల నుంచి ఛీత్కారాలు ఎదురయ్యాయి. ముఖ్యంగా మహిళా ఉద్యోగులే ఆమె పట్ల కఠినమైన వ్యాఖ్యలు చేసేవారు. దీంతో ఆ పచ్చబొట్లు కనిపించకుండా ఆమె పొడుగు చేతులు ఉండే దుస్తులు ధరించాల్సి వచ్చేది. మెడ, చెవుల భాగంలో టాటూలు కనిపించకుండా హెయిర్‌స్టైల్‌ను మార్చుకునేది. ఇలాంటి చర్యలతో రణంగా సమ్మర్‌లో చాలా ఇబ్బందులు పడేది జెస్సికా. 

ఇంకా దాచలేను
టాటూలు ఆమె పాలిట శత్రువులు కావడంతో అనేక కంపెనీలు మారుతూ వచ్చింది. తాజాగా ఎవల్యూషన్‌ క్యాపిటల్‌లో చేరింది. దీంతో  వెబ్‌సైట్‌లో ఆమె ఫోటో, ఇతర వివరాలు వెల్లడించాల్సిన అవసరం వచ్చింది. కొత్త ఆఫీసులో టాటూలతో ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలని నిర్ణయించుకుంది. అందుకే  బాస్‌ గదిలోకి అడుగు పెట్టిన జెస్సికా.. భయంభయంగానే తన ఒంటిపై ఉన్న టాటూల సంగతి చెప్పింది. ఇంకా వాటిని దాచి పెడుతూ ఉండలేనంది. ఆఫిషియల్‌ వెబ్‌సైట్‌లో జాకెట్‌(కోట్‌)తో కూడిన ఫోటోను అప్‌లోడ్‌ చేస్తానని, తన పర్సనల్‌ లింక్డ్‌ఇన్‌లో స్లీవ్‌లెస్‌ డ్రెస్‌తో టాటూలు కనిపించేలా ఉన్న ఫోటో అప్‌లోడ్‌ చేస్తానంటూ రిక్వెస్ట్‌ చేసింది. బాస్‌ ఎలా రియాక్ట్‌ అవుతాడో అనే టెన్షన్‌తో ఆమెలో పెరిగిపోతోంది.
లౌడ్‌ అండ్‌ ప్రౌడ్‌
జెస్సికా రిక్వెస్ట్‌ని విన్న వాళ్ల బాస్‌ సానుకూలంగా స్పందించారు. ఒక్క లింక్డ్‌ఇన్‌లోనే ఎందుకు తమ సంస్థకు సంబంధించిన అఫిషీయల్‌ వెబ్‌సైట్‌లో కూడా టాటూ కనిపించేలా ఉన్న ఫోటోనే అప్‌లోడ్‌ చేసుకోమన్నారు. ఈ విషయంలో గోప్యత అనవసరమని.. రెండు చోట్ల స్లీవ్‌లెస్‌తో టాటూలు కనిపించేలా ఫోటోలు అప్‌లోడ్‌ చేయ్‌ విత్‌ లౌడ్‌ అండ్‌ ప్రౌడ్‌ అంటూ పర్మిషన్‌ ఇచ్చాడు.

పెర్ఫార్మెన్స్‌ ముఖ్యం
నేను కోటు ధరించానా ? స్లీవ్‌లెస్‌లో ఉన్నానా ? నా ఒంటిపై టాటూలు ఉన్నాయా? అనేవి అప్రాధాన్య విషయాలు. నేను ఎలా పని చేస్తున్నాను. నా పెర్ఫార్మెన్స్‌ ఎలా ఉంది. వృత్తి పట్ల అంకితభావంతో ఉన్నానా లేనా అనేవే పరిగణలోకి తీసుకోవాలి. కానీ ఇంత కాలం అలా జరగలేదు. నా వృత్తిగత జీవితంలో నా పెర్ఫార్మెన్స్‌ కంటే టాటూల మీదే ఎక్కువ చర్చ జరిగింది. దీంతో నాకెంతో ఇష్టమైన టాటూలు అంటేనే భయం వేసే పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు నేను ఫ్రీ అయ్యాను. నా మీద ఉన్న ఒత్తిడి తొలగిపోయింది. ఇప్పుడు నేను రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తాను అంటూ  జెస్సికా లింక్డ్‌ఇన్‌లో రాసుకొచ్చింది.
 

చదవండి: దేశంలో మహిళలకు ఎక్కువ ఉద్యోగాలు ఇస్తున్న సంస్థలు ఇవే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement