భేదాలు చూడని ప్రేమకు భరోసానిచ్చే బహుమతి | Financial Gifts On Valentines Day | Sakshi
Sakshi News home page

భేదాలు చూడని ప్రేమకు భరోసానిచ్చే బహుమతి

Published Tue, Feb 13 2024 12:23 PM | Last Updated on Tue, Feb 13 2024 2:38 PM

Financial Gifts On Valentines Day - Sakshi

కులం, మతం, ప్రాంతం.. ఇలాంటి భేదాలు లేకుండా జరుపుకొనే వేడుక ఏదైనా ఉందంటే అది ఒక్క ‘వేలంటైన్స్‌ డే’నే అని చెప్పాలి. ప్రేమకు ఎలాంటి హద్దులు ఉండవు. ప్రేమ ధనిక, పేద తేడాను చూడదు. అందుకే ఈ పదానికి ఎంతో విశిష్టత ఉంది. ఇక ప్రేమలో ఉన్న వారికి ప్రతిరోజూ ఓ పండగే అయినా ఏటా ఫిబ్రవరి 14న మాత్రం ‘ప్రేమికుల దినోత్సవాన్ని’ ప్రత్యేకంగా జరుపుకొంటారు.

త‌మ ప్రియ‌మైన జీవిత భాగ‌స్వామికి త‌న మ‌న‌సులోని ప్రేమ‌ను చాటుతూ వారికి మంచి బ‌హుమ‌తి ఇవ్వాల‌ని చాలామంది చూస్తుంటారు. ఈ విషయంలో ఒక్కొక్కరిదీ ఒక్కో ఆలోచ‌న‌. ఎవ‌రి అభిరుచి, బ‌డ్జెట్‌కి త‌గిన‌ట్లు బ‌హుమ‌తి ఎంచుకుంటూ ఉంటారు. పుష్పగుచ్చం, చాక్లెట్స్‌, బంగారం ఇలా అనేక బ‌హుమ‌తులు ఇస్తుంటారు. ఈసారి ఇందుకు భిన్నంగా వారి ఆర్థిక జీవితానికి, భ‌విష్యత్‌కు భరోసానిచ్చే ఈ బహుమతులు ఇచ్చి చూడండి. తప్పకుండా వారు సర్‌ప్రైజ్‌ అవుతారు.

డిపాజిట్లు, పెట్టుబడుల రూపంలో..

పెట్టుబ‌డులు మీ జీవిత భాగ‌స్వామికి గొప్ప బ‌హుమ‌తి అవుతాయి. వారి భ‌విష్యత్‌ ల‌క్ష్యాలు చేరుకునేందుకు ఇవి ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రిక‌రింగ్ డిపాజిట్లు, మ్యూచువ‌ల్ ఫండ్లు, పీపీఎఫ్ ఇలా పెట్టుబ‌డుల‌కు అనేక మార్గాలు ఉన్నాయి. ఒక‌వేళ మీరు ఏదైనా విలువైన బ‌హుమ‌తి కొనాల‌నుకుని మీ వ‌ద్ద స‌రిప‌డా డ‌బ్బు లేక‌పోతే.. ఎప్పుడు వారికి ఆ బ‌హుమ‌తి ఇస్తే వారికి ఉప‌యోగ‌ప‌డుతుందో చూడండి. ఒక‌టి రెండేళ్లు స‌మ‌యం ఉంటే రిక‌రింగ్ డిపాజిట్ ఖాతా తెరిచి, కాల‌ప‌రిమితి ఏర్పాటు చేసుకుని, ప్రతి నెలా నిర్దిష్ట మొత్తాన్ని జ‌మ‌చేయండి. మొద‌టి నెల మొత్తాన్ని జ‌మ చేసి దానికి సంబంధించిన వివ‌రాలు వారికి తెలియ‌జేసి బ‌హుమ‌తి ఇవ్వండి. దీర్ఘకాలం పాటు నెల‌వారీ సిప్ విధానం ద్వారా పెట్టుబ‌డులు ప్రారంభించి బ‌హుమ‌తి ఇవ్వొచ్చు. లేదా మీ జీవిత భాగ‌స్వామికి ఇష్టమైన సంస్థల షేర్లను కొనుగోలు చేసి బహుమతి ఇవ్వొచ్చు.

జీవిత, ఆరోగ్య బీమాతో..

మీ జీవిత భాగ‌స్వామి, పిల్లల భవిష్యత్‌కు బీమా భరోసా కల్పించొచ్చు. జీవిత (టర్మ్ ప్లాన్), ఆరోగ్య బీమాలో ఏదైనా ఎంపిక చేసుకోవ‌చ్చు. ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో అనుకోని సంఘ‌ట‌న‌లు జ‌రిగితే ఈ పాల‌సీలు మీ జీవిత భాగస్వామికి అండగా ఉంటాయి. దీంతో భ‌విష్యత్‌కు భరోసానిచ్చే అతిపెద్ద బ‌హుమ‌తి వారికి ఇస్తున్నట్లే అవుతుంది.

ఎమర్జెన్సీ కోసం క్రెడిట్ లైన్..

అన్ని అత్యవసర సమయాల్లోనూ మీరు మీ జీవిత భాగ‌స్వామి పక్కన ఉండ‌లేక‌పోవ‌చ్చు. కానీ ఫ్లెక్సీపేతో వ్యక్తిగత క్రెడిట్ లైన్‌ను అందించ‌వ‌చ్చు. స్వల్పకాలిక, చిన్న చిన్న అత్యవసరాల కోసం ఇది వారికి ఉప‌యోగ‌ప‌డుతుంది. ప్రతిసారీ రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేయాల్సిన అవ‌స‌రం లేకుండా అత్యవసరాలకు అందుబాటులో ఉంటుంది. కాబ‌ట్టి ఇది వారికి ఉప‌యోగ‌ప‌డే బ‌హుమ‌తి అవుతుంది.

బంగారం పథకాలతో..

భార‌తీయుల‌కు బంగారం ప‌ట్ల మ‌మ‌కారం ఎక్కువ‌. ఇందులో భావోద్వేగాలు నిండి ఉంటాయి. బంగారం బ‌హ‌మ‌తి ఇస్తే మీ ప్రియ‌మైన వారి ఆనందానికి అవ‌ధులు ఉండ‌వు. అయితే, బంగారాన్ని ఆభ‌ర‌ణాల రూపంలో కాకుండా సావరిన్‌ గోల్డ్‌ బాండ్ల రూపంలో గానీ, గోల్డ్ ఈటీఎఫ్ రూపంలో గానీ, డిజిట‌ల్‌గా గానీ అందించడం వల్ల ఆర్థికంగా ఎక్కువ ప్రయోజనం ఉంటుందని నిపుణులు అంటున్నారు.

ఇదీ చదవండి: 'వాలెంటైన్స్ డే' రోజు షాకివ్వనున్న డ్రైవర్లు, డెలివరీ బాయ్స్‌!

ఈ ప్రేమికుల రోజున మీకు ప్రియ‌మైన‌ భార్య, పిల్లల భ‌విష్యత్‌ను సుర‌క్షితం చేసే బ‌హుమ‌తులు వారికి అందించండి. మీ కుటుంబ స‌భ్యుల‌కు పొదుపు, పెట్టుబ‌డులు, బ్యాంకులు అందించే సేవ‌లు, క్రెడిట్ కార్డులు, బీమా ఇలా అన్ని ఆర్థిక విష‌యాల ప‌ట్ల అవ‌గాహ‌న క‌ల్పించండి. పొదుపు చేయ‌డం పిల్లలకు అల‌వాటు చేయండి. మీరు చేసే పొదుపు అల‌వాట్లు, ఆర్థిక విష‌యాల గురించి నేర్పించే పాఠాలే భ‌విష్యత్‌లో వారికి గొప్ప బహుమతులు అవుతాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement