
రజనీకాంత్ దేవీదాస్ ష్రాఫ్
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలు ఈసారి వ్యాపార, పారిశ్రామిక రంగంలో అయిదుగురికి దక్కాయి. రజనీకాంత్ దేవీదాస్ ష్రాఫ్, రజనీ బెక్టార్, జస్వంతీబెన్ జమ్నాదాస్ పోపట్, పి. సుబ్రమణియన్, శ్రీధర్ వెంబు ఇందులో ఉన్నారు. వీరిలో ఒకరికి పద్మభూషణ్ పురస్కారం రాగా, మిగతావారికి పద్మశ్రీ పురస్కారం దక్కింది. వారి వివరాలు..
రజనీకాంత్ దేవీదాస్ ష్రాఫ్ (పద్మభూషణ్): పంట సంరక్షణ ఉత్పత్తుల సంస్థ యునైటెడ్ ఫాస్ఫరస్ లిమిటెడ్ (యూపీఎల్) వ్యవస్థాపకుడు. ఈ సంస్థ క్రిమిసంహారకాలు, విత్తనాలు మొదలైనవి ఉత్పత్తి చేస్తోంది. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం ష్రాఫ్ 1.7 బిలియన్ డాలర్ల సంపదతో దేశీ కుబేరుల్లో 93వ స్థానంలో ఉన్నారు.
రజనీ బెక్టార్ (పద్మశ్రీ): మిసెస్ బెక్టార్స్ ఫుడ్ కంపెనీ అధినేత. రూ. 20,000 పెట్టుబడితో ప్రారంభించిన ఐస్–క్రీమ్స్ వ్యాపారాన్ని నేడు రూ. 1,000 కోట్ల స్థాయికి విస్తరించారు. ఇటీవలే ఇది ఐపీఓ ద్వారా విజయవంతంగా లిస్ట్ అయింది.
జస్వంతీబెన్ జమ్నాదాస్ పోపట్ (పద్మశ్రీ): అప్పడాల తయారీ సంస్థ లిజ్జత్‌ను ఏర్పాటు చేసిన వ్యవస్థాపకుల్లో ఒకరు. ఓ సామాజిక సేవా కార్యకర్త నుంచి అప్పుగా తీసుకున్న రూ. 80తో 1950లలో ప్రారంభమైన లిజ్జత్ ప్రస్తుతం 800 కోట్ల పైచిలుకు వ్యాపారం సాగిస్తోంది.
పి. సుబ్రమణియన్ (పద్మశ్రీ): గేర్ మ్యాన్ ఆఫ్ కోయంబత్తూర్‌గా పిల్చుకునే సుబ్రమణియన్.. 1969లో శాంతి ఇంజినీరింగ్ అండ్ ట్రేడింగ్ కంపెనీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అది శాంతి గేర్స్‌గా మారింది. మురుగప్ప గ్రూప్‌నకు దీన్ని విక్రయించాక సుబ్రమణియన్ .. తను సొంతంగా ఏర్పాటు చేసిన శాంతి సోషల్ సర్వీస్ అనే సంస్థ ద్వారా సామాజిక సేవా కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు. ఆయన మరణానంతరం పద్మశ్రీ పురస్కారం దక్కింది.
శ్రీధర్ వెంబు (పద్మశ్రీ): క్లౌడ్ ఆధారిత బిజినెస్ సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ జోహో వ్యవస్థాపకుడు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కేవలం పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితం చేయకుండా గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించే ప్రయత్నాల్లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment