భారత్‌కి ఫ్రెంచ్‌ కోర్టు షాక్‌! పారిస్‌లో భారత్‌ ప్రభుత్వ ఆపార్ట్‌మెంట్‌ జప్తు | French Court Gave Ruling to Seize An Indian apartment In Paris | Sakshi
Sakshi News home page

భారత్‌కి ఫ్రెంచ్‌ కోర్టు షాక్‌! పారిస్‌లో భారత్‌ ప్రభుత్వ ఆపార్ట్‌మెంట్‌ జప్తు

Published Fri, Jan 14 2022 10:05 AM | Last Updated on Fri, Jan 14 2022 11:29 AM

French Court Gave Ruling to Seize An Indian apartment In Paris - Sakshi

న్యూఢిల్లీ: దేవాస్‌ షేర్‌హోల్డర్లు దాఖలు చేసిన ఒక దావాలో ఫ్రెంచ్‌ కోర్ట్‌ ఒకటి కీలక రూలింగ్‌
ఇచ్చింది. పారిస్‌లోని భారత్‌ ప్రభుత్వ అపార్ట్‌మెంట్‌ను జప్తు చేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రద్దయిన దేవాస్‌– ఇస్రో వాణిజ్య విభాగం ఆంట్రిక్స్‌ ఉపగ్రహ ఒప్పంద వివాదానికి సంబంధించి 1.3 బిలియన్‌ అమెరికా డాలర్ల ఆర్బ్రిట్రేషన్‌ అవార్డును అమలు చేయాలని కోరుతూ ఈ దావా దాఖలైంది. ఈ భవనం గతంలో ఇండియన్‌ డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ మిషన్‌ నివాసంగా ఉంది. అపార్ట్‌మెంట్‌ విలువ దాదాపు 3.8 మిలియన్‌ యూరోలు ఉంటుందని అంచనా. ‘భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఆస్తులు ఉన్నాయి. ఇది ప్రారంభం మాత్రమే. మేము మరిన్ని జప్తులను ప్లాన్‌ చేస్తున్నాము’’ అని  దేవాస్‌ వాటాదారుల సీనియర్‌ సలహాదారు జే న్యూమాన్‌  పేర్కొన్నారు. అయితే దేవాస్‌ తాజా చర్యపై ఇటు ఇస్రో నుంచి కానీ లేదా ప్రభుత్వం నుండి తక్షణ స్పందన ఏదీ వెలువడలేదు.  

కెయిర్న్‌ కేసులోనూ ఇదే ఆస్తి... 
కాగా రెట్రాస్పెక్టివ్‌ పన్ను వివాదంలో అంతర్జాతీయ ఆర్ర్‌బిట్రేషన్‌ ఇచ్చిన అవార్టుకు అనుగుణంగా భారత్‌ ప్రభుత్వం నుంచి 1.2 బిలియన్‌ డాలర్లను రాబట్టుకోడానికి బ్రిటన్‌కు చెందిన కెయిర్న్‌ ఎనర్జీ గత ఏడాది జూలైలో ఇదే ఆస్తిపై జప్తు ఆదేశాలు తెచ్చుకుంది. అయితే అటు తర్వాత దాదాపు నెల రోజులకు భారత్‌ ప్రభుత్వం రెట్రాస్పెక్టివ్‌ పన్ను ఉపసంహరణ ప్రకటన, తదుగుణమైన చర్యల్లో భాగంగా ఈ కేసును కెయిర్న్‌ ఎనర్జీ ఉపసంహరించుకుంది. తరువాత దేవాన్‌ షేర్‌హోల్డర్స్‌ 2021 సెప్టెంబర్‌లో ఫ్రెంచ్‌ కోర్టును ఆశ్రయించారు.  

వివాదమిది... 
క్లుప్తంగా చూస్తే, ఎస్‌–బ్యాండ్‌ శాటిలైట్‌ స్పెక్ట్రమ్‌ని ఉపయోగించి మొబైల్‌ వినియోగదారులకు మల్టీమీడియా సేవలను అందించడానికి ఆంట్రిక్స్‌తో 2005లో దేవాస్‌ మల్టీమీడియా ఒక అవగాహన కుదుర్చుకుంది. అయితే 2011లో ఈ ఒప్పందం రద్దయ్యింది. బ్రాడ్‌బ్యాండ్‌ స్పెక్ట్రమ్‌ వేలంలో మోసం జరిగిందన్న ఆరోపణలు,  జాతీయ భద్రత–ఇతర సామాజిక ప్రయోజనాల కోసం ప్రభుత్వానికి ఎస్‌–బ్యాండ్‌ శాటిలైట్‌ స్పెక్ట్రమ్‌ అవసరమన్న వాదన తత్సబంధ అంశాలు దీనికి నేపథ్యం. ఈ విషయంలో ఆర్ర్‌బిటేషన్‌ ట్రిబ్యునల్‌ దేవాస్‌ షేర్‌హోల్డర్లకు అనుకూలంగా రూలింగ్‌ ఇచ్చింది. దేవాస్‌ షేర్‌హోల్డర్లలో అమెరికా పెట్టుబడి గ్రూపులు కొలంబియా క్యాపిటల్, టెలికం వెంచర్స్, డ్యుయిష్‌ టెలికంలు ఉన్నాయి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement