ఒకప్పుడు సైన్స్ కాల్పనిక నవలలు, సినిమాలకే పరిమితమైన కృత్రిమ మేధ (ఏఐ) నేడు జనజీవితాల్లో భాగమైంది. ఈ సాంకేతికత ద్వారా ఎన్నో సేవలు, సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. కానీ ఏఐ ద్వారా వచ్చే సమాచారంలో నిజం ఎంత? దాన్ని ఏ మేరకు నమ్మొచ్చు? మనిషికన్నా ఏఐ తెలివిమీరితే మన భవిష్యత్తు ఏమవుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
కృత్రిమ మేధ (ఏఐ) మనిషి జీవితంలో ఎన్నో మార్పులు, సౌకర్యాలు తీసుకొస్తోంది. ఆన్‌లైన్‌లో వస్తుసేవల క్రయవిక్రయాలకు తోడ్పడుతోంది. ఓటీటీలో ఏయే సినిమాలు, సిరీస్ చూడవచ్చో సలహాలిస్తోంది. సిరి, అలెక్సాల ద్వారా మాట్లాడుతోంది. వ్యాపారాలు సులభంగా వేగంగా సాగేందుకు ఉపకరిస్తోంది. అదే సమయంలో కొన్ని సందర్భాల్లో అది అందిస్తున్న సమాచారంలో నిజాలు కరవవుతున్నాయి. దాంతో ప్రజలు, జాతుల మధ్య అనిశ్చితులు ఎదురవుతున్నాయి.
తాజాగా గూగుల్ జెమిని ఏఐ చారిత్రాత్మక పొరపాటు చేసినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. జెమిని ఏఐ టూల్‌ను పోప్‌కు సంబంధించిన ఫొటోలు కావాలని అడిగినపుడు నల్లజాతీయులు పోప్‌గా ఉన్న చిత్రాలను చూపించినట్లు తెలిసింది. కొన్నిసార్లు ముదురు చర్మంతో ఉన్న ఫొటోలను అందించినట్లు గుర్తించారు. దాంతో గూగుల్ జెమిని చారిత్రాత్మక పొరపాటు చేసినట్లయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇతర సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో గూగుల్ మరిన్ని విమర్శలు ఎదుర్కొంటుంది.
ఈ సంఘటనపై జెమిని ఏఐ సీనియర్ డైరెక్టర్ ఆఫ్ ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ జాక్ క్రావ్‌జిక్ మాట్లాడుతూ గూగుల్ పక్షపాత ధోరణిని తీవ్రంగా పరిగణిస్తుందని చెప్పారు. ఇందుకు సంబంధించిన కారణాలు తెలుసుకుని ఏఐ నిబంధనలకు అనుగుణంగా ఇమేజ్ జనరేషన్ సామర్థ్యాలను రూపొందిస్తామన్నారు. ఘటనకు సంబంధించి వెంటనే చర్యలు ప్రారంభిస్తామన్నారు.
ఇదీ చదవండి: దేశం విడిచివెళ్లకుండా ప్రముఖ కంపెనీ సీఈఓకు ఈడీ నోటీసులు
గూగుల్ జెమిని పేరుతో అత్యంత అడ్వాన్స్‌డ్ వెర్షన్ ఏఐ మోడల్‌ను ఇటీవలే పరిచయం చేసింది. ఇది టెక్ట్స్, ఫొటో, ఆడియో, వీడియో, కోడింగ్ వంటి వివిధ రకాల సమాచారాన్ని 90 శాతం కచ్చితత్వంతో యూజర్లకు అందిస్తుందని తెలిపింది. జెమిని 1.0 వెర్షన్‌ను మూడు వేరియంట్లలో తీసుకొచ్చారు. జెమిని అల్ట్రా, జెమిని ప్రో, జెమిని నానో. ఇది డేటా సెంటర్ల నుంచి మొబైల్ డివైజ్‌ల వరకు అన్నింటిలో పనిచేస్తుందని గూగుల్ వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment