న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న విమానయాన సంస్థ గో ఫస్ట్ తాము స్వచ్ఛందంగా దాఖలు చేసిన దివాలా పిటిషన్‌పై త్వరగా నిర్ణయం తీసుకోవాలని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)కి విజ్ఞప్తి చేసింది. విమానాలను లీజుకిచ్చిన సంస్థలు (లెస్సర్లు) వాటిని డీరిజిస్టర్ చేయడం మొదలుపెట్టాయని తెలిపింది. దీనితో గో ఫస్ట్ అభ్యర్థనను సత్వరం పరిశీలించేందుకు ఎన్‌సీఎల్‌టీ బెంచ్ అంగీకరించింది.
36 విమానాల రిజిస్ట్రేషన్‌ను ఉపసంహరించాల్సిందిగా కోరుతూ లీజింగ్ కంపెనీలు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ)ని కోరాయి. మరోవైపు, తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు టికెట్ల బుకింగ్ చేపట్టవద్దంటూ కంపెనీని డీజీసీఏ ఆదేశించింది. అలాగే, సురక్షితమైన, విశ్వసనీయమైన విధంగా సర్వీసులు నడపడంలో విఫలం కావడంపై 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు సమాచారం. ఆ వివరణను బట్టి ఆపరేటర్ సర్టిఫికెట్ (ఏవోసీ)ని కొనసాగనివ్వడంపై నిర్ణయం తీసుకోనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం ఫ్లయిట్ సేవలను నిలిపివేసిన గో ఫస్ట్.. మే 15 వరకూ టికెట్ల విక్రయాన్ని ఆపేసిన సంగతి తెలిసిందే. గో ఫస్ట్ గత 17 ఏళ్లుగా విమాన సేవలు నిర్వహిస్తోంది. అయితే, ప్రాట్ అండ్ విట్నీ (పీఅండ్‌డబ్ల్యూ) ఇంజిన్ల వైఫల్యం కారణంగా కొన్నాళ్లుగా సగానికి పైగా విమానాలను నడపడం లేదు. దీంతో ఆదాయం పడిపోయి, ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో కూరుకుపోవడం వల్ల దివాలా ప్రక్రియ చేపట్టాలంటూ ఎన్‌సీఎల్‌టీని కంపెనీ ఆశ్రయించింది. దీనిపై మే 4న విచారణ జరిపిన ట్రిబ్యునల్ .. ఉత్తర్వులను రిజర్వ్‌లో ఉంచింది. రుణ దాతలకు గో ఫస్ట్ దాదాపు రూ. 11,463 కోట్లు చెల్లించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment