న్యూ ఢిల్లీ: భారత్ లో టిక్ టాక్ ని నిషేదించిన తర్వాత దాని స్థానాన్ని భర్తీ చేయడానికి వచ్చిన చింగారి, మిట్రాన్, రోపోసో, ట్రెల్, స్నాక్ వీడియో వంటి యాప్ లకు మంచి ఆదరణ లభించింది. స్నాక్ వీడియో యాప్ లో షార్ట్ వీడియోస్ కోసం మంచి టూల్స్ అందుబాటులో ఉండటం వల్ల దాని డౌన్‌లోడ్‌ల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఇటీవల వెలువడిన గణాంకాల ప్రకారం దేశీయ యాప్ లను డౌన్ లోడ్ పరంగా ఈ యాప్ అధిగమించింది. కానీ, తాజాగా ప్రభుత్వం నిషేదించిన 43 యాప్ ల జాబితాలో స్నాక్ వీడియో యాప్ కూడా ఉండటంతో యూజర్లు అందరు షాక్ కి గురి అయ్యారు.
మంగళవారం సాయంత్రం, దేశ సార్వభౌమత్వం, సమగ్రత, భద్రత దృష్ట్యా చైనా నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న మరో 43 మొబైల్ అప్లికేషన్లపై చర్యలు చేపట్టింది. హోంమంత్రిత్వశాఖ నేతృత్వంలోని సైబర్ క్రైం కోఆర్డినేషన్ కేంద్రం నుంచి వచ్చిన సమగ్ర నివేదికలపై చర్చించిన అనంతరం ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ఈ యాప్‌లపై నిషేధం విధించినట్టు కేంద్రం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఐటీ చట్టం 69ఎ సెక్షన్ ప్రకారం కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ఈ చర్యలు తీసుకుందని కేంద్రం తెలిపింది.(చదవండి: 43 చైనా యాప్‌లపై నిషేధం)
స్నాక్ వీడియో డౌన్ లోడ్ పరంగా దూసుకుపోతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సంస్థని షాక్ కి గురి చేసింది. సెన్సార్ టవర్ నుండి వచ్చిన తాజా డేటా ప్రకారం, అత్యధికంగా డౌన్‌లోడ్ చేస్తున్న యాప్ లలో స్నాక్ వీడియో ఒకటి. టిక్‌టాక్‌ను భారతదేశంలో నిషేధించిన రోజు(జూన్ 29) నుండి ఇప్పటి వరకు 190 మిలియన్ డివైస్ లలో దీనిని డౌన్‌లోడ్‌లను చేసుకున్నారు. భారత్ లో టిక్ టాక్ నిషేధం తర్వాత స్నాక్ వీడియోకి ప్రజాదరణ బాగా పెరిగింది. స్వదేశీ యాప్(మిట్రాన్ టివి, చింగారి, ట్రెల్ మరియు రోపోసో )లను కూడా ఇది దాటేసింది. గత 30 రోజుల్లో, స్నాక్ వీడియో భారతదేశంలో 35 మిలియన్ మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు.
సెన్సార్ టవర్ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం చింగారి, మిట్రాన్ టీవీ, ట్రెల్ యొక్క డౌన్‌లోడ్ సంఖ్య మిలియన్ ల నుండి లక్షలకు పడిపోయాయి. గత 30 రోజుల్లో, చింగారి, ట్రెల్, మిట్రాన్ టీవీ లను డౌన్‌లోడ్ చేసుకున్న వారి సంఖ్య 8లక్షలు, 3 లక్షలు, 55,000. ఈ ఏడాది ప్రారంభంలో స్నాక్ వీడియో యాప్‌ను కుయిషౌ టెక్నాలజీ ప్రారంభించింది. ఇది చైనాకు చెందిన సంస్థ. ఈ యాప్ గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌లో బైట్‌డాన్స్ యాజమాన్యంలోని ప్రముఖ టిక్‌టాక్ యాప్ కి పోటీదారుగా నిలిచింది. ఇది చాలా కాలం నుండి గూగుల్ ప్లే స్టోర్ మరియు ఆపిల్ యాప్ స్టోర్లలో అందుబాటులో ఉంది. భారత ప్రభత్వం జూన్ లో నిషేధం విధించిన జాబితాలో లేనప్పటికీ నిన్న భారత ప్రభుత్వం చేత నిషేదించబడింది. (చదవండి: పబ్‌జీ టోర్నీలో గెలిస్తే రూ. 6 కోట్లు!)
Comments
Please login to add a commentAdd a comment