
సైట్‌ను హ్యాక్ చేసి 12 వేలు కొల్లగొట్టిన వ్యక్తికే పిలిచి మరీ సెక్యూరిటీ చీఫ్ జాబ్ ఆఫర్ చేసిన బాధిత వెబ్‌సైట్
డీసెంట్రలైజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌కి గట్టి దెబ్బ కొట్టిన వైట్ హ్యాట్ మరో సంచలనం సృష్టించాడు. ఏ చోటైతే 12 వేల కోట్ల రూపాయలను కొల్లగొట్టాడో.. తిరిగి అదే సంస్థ నుంచి చీఫ్ సెక్యూరిటీ అడ్వైజర్ ఆఫీసర్ జాబ్ సంపాదించాడు. దోపిడి చేసిన వాడికి దండన విధించే అవకాశం ఇవ్వకుండా అతని మెడలో దండలు వేయాలని ఆ కంపెనీ ఎందుకు అనుకుంటోంది. దానికి గల కారణమేంటీ ?
సాక్షి, వెబ్‌డెస్క్: డీసెంట్రలైజ్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించే పాలిగాన్ డిఫై యాప్ గత వారం హ్యాకింగ్‌కు గురైంది. ఈ యాప్‌లో లావాదేవీలు నిర్వహిస్తున్న క్రిప్టో కరెన్సీ భారీ ఎత్తున దోపిడి అయ్యింది. పాలినెట్‌వర్క్ నుంచి ఈథేరమ్‌కి సంబంధించి 273 మిలియన్ టోకెన్లు, బినాన్స్ స్మార్ట్ చైయిన్‌కి సంబంధించి 253 మిలియన్ల టోకెన్లు, 85 మిలియన్ల యూఎస్ డాలర్ కాయిన్లు, 33 మిలియన్ల విలువైన స్టేబుల్ కాయిన్లను స్వాహా అయ్యాయి. మొత్తంగా 611 మిలియన్ డాలర్ల విలువైన క్రిప్టో కరెన్సీని హ్యాకర్ తస్కరించారు. ఇండియన్ కరెన్సీలో ఇది దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలకు సమానం.
మంచిదొంగ
బ్లాక్ చెయిన్ టెక్నాలజీని క్రాక్ చేసి క్రిప్టో కరెన్సీ కొట్టేసిన హ్యాకర్‌కి పాలినెట్‌వర్క్ టీమ్ లేఖ రాసింది. దోచేసిన సొత్తును తిరిగి ఇచ్చేయ్సాలిందిగా విజ్ఞప్తి చేసింది. దీనికి స్పందించిన హ్యాకర్ మరుసటి రోజే హ్యాకర్ సానుకూలంగా స్పందించి కొట్టేసిన సొత్తులో 260 మిలియన్ డాలర్లు జమ చేశారు. ఇందులో ఈథేరియమ్ 3.3 మిలియన్ డాలర్లు, బినాన్స్ స్మార్ట్ కాయిన్లు 256 మిలియన్లు, పాలిగాన్ 1 మిలియన్ డాలర్ల విలువైన క్రిప్టో కరెన్సీని పాలినెట్‌వర్క్ డిఫై యాప్‌లో జమ చేశాడు. దీంతో అప్పటి నుంచి ఈ హ్యాకర్‌ని వైట్‌హ్యాట్‌గా పేర్కొటోంది బాధిత పాలినెట్ వర్క్.
వైట్‌హ్యాట్
సాధారణంగా హ్యాకర్లు ఎవరో, ఎలా ఉంటారో తెలియదు. హ్యాకర్లను సూచించేందుకు నల్లటోపీ లేదా హుడీ క్యాప్ ధరించి ముఖం సరిగా కనిపించని వ్యక్తి ఇమేజ్‌ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కాలక్రమేనా హ్యాకర్లకు బ్లాక్‌హ్యాట్ పేరు స్థిరపడిపోయింది. అయితే ఇందులో బాధితుల మేలు కోరి హ్యాక్ చేసే వారు కూడా ఉంటారు. వీరిని ఎథికల్ హ్యాకర్లుగా పేర్కొంటారు. ఏదైనా సంస్థకు సంబంధించి సైబర్ సెక్యూరిటీలో లోపాలను బయటపెట్టేందుకు వీరు హ్యాక్ చేస్తుంటారు. వీరిని వైట్ హ్యాట్‌గా పేర్కొనడం రివాజుగా మారింది.
సెక్యూరిటీ చీఫ్
ప్రస్తుతం పాలినెట్‌వర్క్‌ని హ్యాక్ చేసింది ఒక్కరా లేక కొంత మంది హ్యకర్ల గ్రూపా అనే అంశంపై స్పష్టత లేదు. ఐనప్పటికీ వైట్‌హ్యాట్‌ను ఒక్కరిగానే గుర్తిస్తూ పాలినెట్ వర్క్ కబురు పంపింది. మీరు హ్యాక్ చేయడం వల్ల మా డిఫై యాప్‌లోని లోపాలు తెలిశాయి. మీలాంటి నిపుణుల అవసరం మాకు ఉంది. కాబట్టి పాలినెట్‌వర్క్‌కి చీఫ్ సెక్యూరిటీ అడ్వైజర్‌గా సేవలు అందివ్వాలని కోరింది. అంతేకాదు హ్యాక్ చేసిన సొమ్ములో ఐదు మిలియన్ డాలర్లను మీ ఖర్చు కోసం అట్టే పెట్టుకుని హ్యాక్ చేసిన క్రిప్టో కరెన్సీలో మిగిలిన దాన్ని తిరిగి ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.
#PolyNetwork has no intention of holding #mrwhitehat legally responsible and cordially invites him to be our Chief Security Advisor. $500,000 bounty is on the way. Whatever #mrwhitehat chooses to do with the bounty in the end, we have no objections. https://t.co/4IaZvyWRGz
— Poly Network (@PolyNetwork2) August 17, 2021
ఇది ఎత్తుగడా?
వైట్‌హ్యాట్‌కి పాలినెట్‌వర్క్ చేసిన విజ్ఞప్తిపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. కొద్ది మంది పాలినెట్ చర్యను స్వాగతిస్తుండగా మరికొందరు హ్యాక్ అయిన సొమ్మను రాబట్టుకునేందుకు పాలినెట్‌వర్క్ వేసిన ఎత్తుగడగా పరిగణిస్తున్నారు. మరికొందరు హ్యాక్ చేసిన సొమ్ము వందల మిలియన్ డాలర్లు ఉండగా హ్యాకర్‌కు జాబ్‌తో పనేంటి అంటూ స్పందిస్తున్నారు.
డీఫై యాప్
సాధారణంగా ఆర్థిక కార్యకలాపాలను బ్యాంకులు నిర్వహిస్తాయి, వాటి పైన సెంట్రల్ బ్యాంకులు అజమాయిషీ ఉంటుంది. ఇవన్నీ ప్రభుత్వ నిబంధనలు, స్థానిక చట్టాలు, రాజ్యంగానికి లోబడి విధులు నిర్వర్తిస్తాయి, ఇక డీఫై అంటే డీ సెంట్రలైజ్‌డ్ ఫైనాన్స్ అని అర్థం. అంటే చట్టాలు, ప్రభుత్వ నిబంధనలు, మధ్యవర్తులు లేకుండా జరిగే ఆర్థిక వ్యవహరాలు. ఇందులో అప్పులు ఇవ్వడం, తీసుకోవడం , మార్పిడి, లాభాలు తదితర అని పనులు నిర్వహిస్తారు. అయితే ఇందులో మారకంగా క్రిప్టోకరెన్నీని ఉపయోగిస్తారు. ఇదంతా బ్లాక్ చెయిన్ అనే ఆర్టిఫీయల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా జరుగుతుంది. ఈ సర్వీసులు అందించే యాప్‌లను డీయాప్ అంటే డీ సెంట్రలైజ్డ్ యాప్ అని అంటారు. ఇలా పని చేసే పాలినెట్‌వర్క్ డీఫై యాప్ హ్యాకింగ్‌కి గురైంది.