
ఓ వైపు ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తున్నప్పటికీ మరోపక్క యూఎస్‌సహా దేశీ స్టాక్ మార్కెట్లు దూకుడు చూపుతున్నాయి. తాజాగా సెన్సెక్స్, నిఫ్టీ చరిత్రాత్మక గరిష్టాలకు చేరాయి కూడా. ఈ నేపథ్యంలో 2020లో ప్రైమరీ మార్కెట్ ఒక్కసారిగా ఊపందుకోగా.. ఈ ఏడాదిలోనూ పలు కంపెనీలు ఐపీవోల ద్వారా నిధుల సమీకరణకు క్యూ కడుతున్నాయి.
ముంబై: వారాంతానికల్లా ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 52,600 పాయింట్లను అధిగమించగా, నిఫ్టీ 15,800ను దాటేసింది. ఇవి సరికొత్త గరిష్టాలుకాగా.. ఈ జోష్ ప్రైమరీ మార్కెట్లకూ పాకింది. దీంతో పలు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు క్యూ కడుతున్నాయి. పేమెంట్స్ సర్వీసుల దిగ్గజం పేటీఎమ్‌సహా ఫైనాన్షియల్ సర్వీసుల రంగానికి చెందిన 12 కంపెనీలు ఐపీవోలకు సిద్ధపడుతున్నాయి. తద్వారా సంయుక్తంగా రూ. 55,000 కోట్లవరకూ సమీకరించే సన్నాహాల్లో ఉన్నాయి. వీటిలో ఫిన్‌టెక్ కంపెనీలు సైతం ఉన్నట్లు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ సంస్థలు పేర్కొన్నాయి.
అతిపెద్ద ఇష్యూ
బీమా, ఆస్తుల నిర్వహణ, వాణిజ్య బ్యాంకింగ్, మైక్రోఫైనాన్స్, నాన్‌బ్యాంకింగ్, హౌసింగ్ ఫైనాన్స్ రంగాల నుంచి సుమారు 12 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టనున్నాయి. ఇందుకు వీలుగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసే సన్నాహాల్లో ఉన్నాయి. ఈ బాటలో రూ. 22,000 కోట్ల ఇష్యూకిగాను పేమెంట్స్ బ్యాంక్ పేటీఎమ్‌కు గ్రీన్‌సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. పేటీఎమ్ ఐపీవో పూర్తయితే అతిపెద్ద ఇష్యూగా రికార్డు సృష్టించనుంది. ఇంతక్రితం 2010 అక్టోబర్‌లో రూ. 15,000 కోట్ల సమీకరణ ద్వారా పీఎస్‌యూ కోల్ ఇండియా రికార్డ్ నెలకొల్పింది. కాగా.. ఇటీవల ఐపీవోకు దరఖాస్తు చేసిన కంపెనీలలో ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్(రూ. 7,500 కోట్లు), పాలసీ బజార్(రూ. 4,000 కోట్లు), ఆప్టస్ హౌసింగ్ ఫైనాన్స్(రూ. 3,000 కోట్లు), స్టార్ హెల్త్(రూ. 2,000 కోట్లు), ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ(రూ. 1,500–2,000 కోట్లు), ఆరోహణ్ ఫైనాన్షియల్(రూ. 1,800 కోట్లు), ఫ్యూజన్ మైక్రోఫైనాన్స్(రూ. 1,700 కోట్లు), ఫిన్‌కేర్ స్మాల్(రూ. 1,330 కోట్లు) తదితరాలున్నాయి.
టాప్–5లో ఒకటి
ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ ఐపీవో ద్వారా రూ. 2,000 కోట్లవరకూ సమకూర్చుకునే యోచనలో ఉంది. రూ. 2.7 లక్షల కోట్ల నిర్వహణలోని ఆస్తుల విలువ రీత్యా కంపెనీ దేశంలోని టాప్–5 ఏఎంసీలలో ఒకటిగా నిలుస్తోంది. ఇక బీమా రంగం నుంచి వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్, రాకేష్ ఝున్‌ఝున్‌వాలాకు పెట్టుబడులున్న స్టార్ హెల్త్ అల్లీడ్ ఇన్సూరెన్స్, మెడి అసిస్ట్‌లు పబ్లిక్ ఇష్యూలు చేపట్టనున్నాయి. ఇదేవిధంగా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలలో పీఈ దిగ్గజం బ్లాక్‌స్టోన్ దన్నుగల ఆధార్ , ఆప్టస్ సైతం ఐపీవో బాట పట్టాయి. మైక్రోఫైనాన్స్ విభాగంలో ఆరోహణ్, ఫ్యూజన్ ఐపీవోలకు రానుండగా.. బ్యాంకింగ్ నుంచి తమిళనాడు మెర్కంటైల్ రెడీ అవుతోంది. కాగా.. ఈ ఏడాది 17 సంస్థలు ఐపీవోల ద్వారా ఇప్పటికే రూ. 17,503 కోట్లు సమకూర్చుకున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. అంతేకాకుండా ఉత్కర్‡్ష స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, గ్లెన్‌మార్క్ లైఫ్ సైన్సెస్, రోలెక్స్ రింగ్స్, సెవెన్ లాండ్స్ షిప్పింగ్ సెబీ నుంచి అనుమతులను పొందినట్లు పేర్కొన్నారు. మరో 26 కంపెనీలు అనుమతుల కోసం చూస్తున్నట్లు తెలియజేశారు.
ప్రైమరీ మార్కెట్ల కళకళ
రెండు నెలల తదుపరి ఈ వారం మళ్లీ పబ్లిక్ ఇష్యూలు సందడి చేయనున్నాయి. నాలుగు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు వస్తున్నాయి. తద్వారా ఉమ్మడిగా రూ. 9,123 కోట్లు సమీకరించాలని భావిస్తున్నాయి. ఇంతక్రితం ఏప్రిల్ 7–9న మాక్రోటెక్ డెవలపర్స్ ఐపీవోకి వచ్చింది. కాగా.. సోమవారం(14) నుంచి శ్యామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీ, సోనా బీఎల్‌డబ్ల్యూ ప్రెసిషన్ ఫోర్జింగ్స్(సోనా క్యామ్‌స్టార్) పబ్లిక్ ఇష్యూలు ప్రారంభమయ్యాయి. ఇక కృష్ణా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, దొడ్ల డైరీ ఐపీవోలు బుధవారం(16న) ఓపెన్ కానున్నాయి. ఈ బాటలో వచ్చే నెల(జూలై) మొదట్లో ఐపీవో ద్వారా క్లీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రైమరీ మార్కెట్లను పలకరించనుంది. రూ. 1,500 కోట్లు సమీకరించే లక్ష్యంతో క్లీన్‌సైన్స్ వస్తోంది. ఇదే సమయంలో ఇండియా పెస్టిసైడ్స్ కూడా పబ్లిక్ ఇష్యూ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. భారీ లిక్విడిటీ ప్రభావంతో సెకండరీ మార్కెట్లతోపాటు.. ప్రైమరీ మార్కెట్లు సైతం బుల్ దూకుడు చూపుతున్నట్లు పలు బ్రోకింగ్ సంస్థలు ఈ సందర్భంగా పేర్కొంటున్నాయి.
టైమ్స్ గ్రీన్ ఎనర్జీ ఇష్యూ..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యవసాయ ఉత్పత్తుల విక్రయంలో ఉన్న హైదరాబాద్ కంపెనీ టైమ్స్ గ్రీన్ ఎనర్జీ ఐపీవోకు వస్తోంది. ఇష్యూ జూన్ 16న ప్రారంభమై 22న ముగియనుంది. ఐపీవో ద్వారా రూ.4.05 కోట్లను సమీకరిస్తారు. రూ.10 ముఖ విలువతో ఒక్కో షేరు ఇష్యూ ధరను రూ.61గా నిర్ణయించారు. మహిళలే నిర్వహిస్తున్న ఈ కంపెనీ ఇటీవలే శానిటరీ న్యాప్‌కిన్స్, డైపర్స్ తయారీలోకి ఎంట్రీ ఇచ్చింది. భారత్ బజార్ బ్రాండ్ పేరుతో ఆన్‌లైన్‌లో ఉత్పత్తులను విక్రయిస్తోంది. కార్యకలాపాలు ప్రారంభించిన 2012లో రూ.10 లక్షల టర్నోవర్ నమోదు చేసింది. 2019–20లో రూ.20 కోట్ల టర్నోవర్ ఆర్జించింది. మూలధన అవసరాలు, ఉత్పత్తుల విస్తరణకు ఐపీవో నిధులను వెచ్చించనున్నారు. కంపెనీ బోర్డు సభ్యులుగా దిన్నె లక్ష్మి జుమాల్, జయశ్రీ గద్దె, రంగినేని వినిత, ప్రియాంక వంగల, ఎస్.దుర్గ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment