
షాకింగ్ న్యూస్..భారీగా పెరగనున్న ఇళ్ల ధరలు..కారణం అదే..?
న్యూఢిల్లీ: ఇళ్ల ధరలు 5–7 శాతం పెరిగే అవకాశం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) వెల్లడించింది. నిర్మాణ వ్యయం దూసుకెళ్లడంతో ఈ ఏడాది ఇప్పటికే 5–8 శాతం ధరలు అధికం అయ్యాయని క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడు హర్ష వర్ధన్ పటోడియా తెలిపారు.
బిల్డింగ్ మెటీరియల్‌పై జీఎస్టీ ఇన్‌పుట్ క్రెడిట్, స్టాంప్ డ్యూటీ తగ్గింపు/మాఫీ, వడ్డీ రేట్ల తగ్గింపు ద్వారా కస్టమర్లకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరారు. ధరల పెరుగుదల ప్రభావంపై క్రెడాయ్ ఇటీవల చేపట్టిన సర్వేలో 1,849 నిర్మాణ సంస్థలు పాలుపంచుకున్నాయి.
‘నిర్మాణంలో వాడే ముడి సరుకుల ధరల నుండి ఉపశమనానికై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ప్రాజెక్టులను సమయానికి అందించలేమని 39 శాతం రియల్ ఎస్టేట్ డెవలపర్లు భావిస్తున్నారు. ధరలు ప్రస్తుత స్థాయిల నుండి తగ్గకపోతే గరిష్టంగా ఆరు నెలల వరకు మాత్రమే ప్రాజెక్టుల నిర్మాణాలను కొనసాగించగలమని 76 శాతం మంది తెలిపారు’ అని సర్వేలో తేలిందని పటోడియా వివరించారు.
చదవండి: రెరా నిబంధనలు...గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..!