రాజకీయాలకు దూరంగా వ్యాపార దార్శనికుడు
రతన్‌టాటా చాలా సాధారణ జీవితాన్ని గడపడానికే ఇష్టపడుతారు. టాటా నానో కారునే ఎక్కువగా వాడేవారట. ఆయన జీవితాన్ని చూసిన ప్రతిఒక్కరూ నిరాడంబరత నేర్చుకోవాల్సిందేనని పలువురు చెబుతారు. ఒకరోజు ఎల్‌ఈడీ టీవీ బిగించటానికి రతన్ టాటా ఇంటికి వెళ్లిన టెక్నీషియన్ ఆయన సాధారణ జీవితం చూసి ఆశ్చర్యపోయాడట. ఎందరో సంపన్నుల ఇళ్లకు వెళ్లి వాళ్ల వైభోగాన్ని చూసిన అతడు టాటా ఇల్లూ అలాగే ఉంటుందనుకున్నాడు. తీరా వెళ్లి తలుపు తడితే సాధారణ షార్ట్స్, పైన ఒక బనీనుతో ఉన్న రతన్ స్వయంగా తలుపు తీశారట. టీవీ బిగించాల్సిన రూమ్‌లోకి తీసుకెళ్లారట. ఆ గది సైతం ఎంతో సాదాసీదాగా, పాతకాలం నాటి ఫర్నిచర్‌తో ఉందట. ఆ సాంకేతిక నిపుణుడు బిగించిన టీవీ కూడా అతి సాధారణమైన 32 అంగుళాల సోనీ టీవీ!
రతన్ ఒకానొక సమయంలో మాట్లాడుతూ..‘సరైన నిర్ణయాలు’ తీసుకోవడంలో నాకు నమ్మకం లేదు. నేనొక నిర్ణయం తీసుకుంటాను. అది సరైనదే అయ్యేలా చేస్తాను. అంతే...’ అని అన్నారు. అందుకే కావొచ్చు, ఆయన హయాంలో టాటా గ్రూపు ఆదాయం 50 రెట్లు మించి పెరిగింది. ఇవాళ టాటా గ్రూపు విలువ దాదాపు రూ.30 లక్షల కోట్లకు చేరుకుంది.
ఇదీ చదవండి: మంచితనంలో అపరకుబేరుడు
రాజకీయాలకు దూరంగా..
రాజకీయ రణరంగంలో రతన్ టాటా గురించి మనం ఎప్పుడైనా విన్నామా? ఆయనపై అస్త్రాలు సంధిస్తూ పార్టీలు పరస్పరం ఎన్నడైనా ఆరోపణలు చేసుకోవటం చూశామా? లేదుకదా. అదీ రతన్ టాటా ప్రత్యేకత. సంస్థ ఎదగడమే కాదు..అనేకమంది జీవితాల్లో వెలుగులు పంచాలన్నది ఆయన సిద్ధాంతం. టాటా గ్రూపు సంస్థలకు సామాజిక సేవంటే చాటింపు వేసుకుని మీడియాకు పోజులిచ్చే సందర్భం కాదు. నెరవేర్చి తీరాల్సిన పవిత్ర కర్తవ్యం. అందుకే ‘టాటా సన్స్’ ఈక్విటీల్లో 66 శాతం టాటా ట్రస్టుల చేతుల్లో ఉంటుంది. వాటిపై వచ్చే డివిడెండ్లు నేరుగా ట్రస్టులు నిర్వహించే సేవాకార్యక్రమాలకు తోడ్పడతాయి.
Comments
Please login to add a commentAdd a comment