
మనదేశంలో అత్యంత సంపన్నుడు ఎవరు అంటే? ముఖేష్ అంబానీ అనే సమాధానం ఠక్కున వినిపిస్తుంది. ఆయన ఆస్తి లక్షల కోట్లలో ఉంటే..అంబానీ తరువాత సంపన్నులుగా ఎవరెవరు ఉన్నారు. వాళ్ల ఆస్తుల విలువ ఎంత? రానున్న రోజుల్లో భారత్‌లో సంపన్నుల సంఖ్య పెరుగుతుందా? ధనవంతులు వారి పిల్లల్ని ఎక్కడ చదివించాలని అనుకుంటున్నారు. వాళ్లు ఏ బ్రాండ్ కార్లను వినియోగిస్తున్నారు. ఇలా ధనవంతుల స్థితిగతులు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటుంది చైనాకు చెందిన హురున్ ఇనిస్టిట్యూట్. అందుకు సంబంధించి రిపోర్ట్‌లను విడుదల చేస్తుంది.
తాజాగా హురున్ ఇండియా వెల్త్ రిపోర్ట్ - 2021 పలు ఆసక్తికర విషయాల్ని వెలుగులోకి తెచ్చింది. హురున్ నిర్వహించిన ఓ సర్వేలో పాల్గొన్న 70శాతం మంది ధనవంతులు తమ పిల్లల్ని విదేశాల్లో చదివించేందుకు ఇష్టపడుతున్నట్లు తేలింది.
హురున్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ 350 మంది భారతీయ మిలియనీర్లపై సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో ఒక్కో భారతీయ ధనవంతుడి వ్యక్తిగత సంపద రూ.7 కోట్లకు సమానంగా ఆస్తులు ఉన్నట్లు తెలిపింది. వారిలో 12శాతంతో 42మంది అత్యంత ధనవంతులుగా ఉండగా వారి నికర ఆస్తుల విలువ రూ.100 కోట్లు. వారి సగటు వయస్సు 35 సంవత్సరాలు. ఇక వారి పిల్లల్ని విదేశాల్లో చదివించాలని భావిస్తున్నట్లు హురున్ రిపోర్ట్‌లో పేర్కొంది. అందులో యూఎస్(29 శాతం), యునైటెడ్ కింగ్‌డమ్ (19 శాతం), న్యూజిలాండ్ (12 శాతం), జర్మనీ (11%) మంది పిల్లల్ని పంపేందుకు ఇష్టపడుతున్నారు.
ధనవంతులు వినియోగించే కార్లలో నాలుగింట ఒక వంతు మంది మూడేళ్లలోపు కార్లను మార్చారు. మెర్సిడెస్ బెంజ్ అత్యంత ప్రజాదరణ పొందిన లగ్జరీ కార్ బ్రాండ్. తర్వాత రోల్స్ రాయిస్, రేంజ్ రోవర్ ఉన్నాయి. లంబోర్ఘిని అత్యంత ప్రజాదరణ పొందిన లగ్జరీ స్పోర్ట్స్ కార్లను వినియోగిస్తున్నట్లు తేల్చింది.
Comments
Please login to add a commentAdd a comment