హైదరాబాద్ (Hyderabad) మార్కెట్లో కార్యాలయ స్థలాలకు (office space) బలమైన డిమాండ్ కొనసాగుతోంది. ప్రస్తుత ఏడాది మొత్తం మీద గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ లీజింగ్ 56 శాతం పెరిగి 12.5 మిలియన్ చదరపు అడుగులు (ఎస్‌ఎఫ్‌టీ)గా ఉన్నట్టు కొలియర్స్ ఇండియా (Colliers) నివేదిక వెల్లడించింది. క్రితం ఏడాది లీజు పరిమాణం 8 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉన్నట్టు పేర్కొంది. ఇక దేశవ్యాప్తంగా ఆరు ప్రధాన నగరాల్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ ఈ ఏడాది 14 శాతం పెరిగి 66.4 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉన్నట్టు కొలియర్స్ నివేదిక తెలిపింది. క్రితం ఏడాది ఇవే పట్టణాల్లో స్థూల కార్యాలయ స్థలాల లీజింగ్ 58.2 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది.
పట్టణాల వారీగా..
» బెంగళూరులో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 21.7 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీకి చేరింది. క్రితం ఏడాది 15.6 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీ లీజుతో పోల్చితే 39 శాతం పెరిగింది.
» ముంబైలోనూ 43 శాతం వృద్ధితో 10 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది.
» పుణెలో ఆఫీస్ స్పేస్ లీజింగ్ క్రితం ఏడాదితో పోల్చి చూస్తే 4 శాతం పెరిగి 5.7 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీకి చేరింది.
» చెన్నైలో స్థూల లీజింగ్ 35 శాతం క్షీణతతో 6.8 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీకి పరిమితమైంది. 2023లో ఇదే పట్టణంలో లీజింగ్ 10.5 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది.
» ఢిల్లీ ఎన్‌సీఆర్‌లోనూ 16 శాతం తక్కువగా 9.7 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీ లీజు నమోదైంది.
2025లోనూ గరిష్ట స్థాయిలోనే..
టెక్నాలజీ, ఇంజనీరింగ్, తయారీ కంపెనీలతోపాటు ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీల నుంచి ఆఫీస్ స్థలాలకు ఈ ఏడాది డిమాండ్ ఎక్కువగా ఉన్నట్టు కొలియర్స్ ఇండియా నివేదిక తెలిపింది. 2025లోనూ ఆఫీస్ స్పేస్ లీజింగ్ గరిష్ట స్థాయిలోనే కొనసాగొచ్చొని కొలియర్స్ ఇండియా ఆఫీస్ సర్వీసెస్ విభాగం ఎండీ అర్పిత్ మెహరోత్రా అంచనా వేశారు. వచ్చే కొన్నేళ్ల పాటు లీజింగ్ 60 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీకి మించి కొనసాగడం సాధారణ అంశంగా మారుతుందన్నారు. గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల (జీసీసీలు) నుంచి స్థిరమైన డిమాండ్ కొనసాగడం పెద్ద పరిమాణంలో ఆఫీస్ స్థలాల లీజింగ్‌కు మద్దతుగా నిలుస్తున్నట్టు బెంగళూరు కేంద్రంగా పనిచేసే సుమధుర గ్రూప్ సీఎండీ మధుసూదన్ పేర్కొన్నారు.
లాజిస్టిక్స్, ఇండస్ట్రియల్ వసతులకూ డిమాండ్
దేశవ్యాప్తంగా టాప్–8 నగరాల్లో లాజిస్టిక్స్, ఇండస్ట్రియల్ (ఎల్‌అండ్‌ఐ) వసతుల లీజింగ్ ప్రస్తుత ఏడాది మొత్తం మీద 50–53 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉండొచ్చని కుష్‌మన్ అండ్ వేక్ ఫీల్డ్ సంస్థ తెలిపింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, పుణె, అహ్మదాబాద్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్) పరిధిలో గతేడాది లాజిస్టిక్స్ అండ్ ఇండస్ట్రియల్ వసతుల లీజింగ్ 53.57 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉన్నట్టు పేర్కొంది. ఈ ఏడాది అక్టోబర్ వరకు లీజింగ్ ఈ నగరాల్లో 41 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీని అధిగమించినట్టు తెలిపింది.
‘‘ప్రభుత్వం 2020లో ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) ప్రకటించిన నాటి నుంచి ఇండస్ట్రియల్ స్థలాల లీజింగ్‌లో మెరుగైన వృద్ధి నమోదవుతోంది. దీనికితోడు రిటైల్, ఈ–కామర్స్ సైతం బలంగా అవతరించడం డిమాండ్‌కు మద్దతుగా నిలిచింది’’అని ఈ నివేదిక వెల్లడించింది. బలమైన పారిశ్రామిక కార్యకలాపాలకు తోడు వినియోగ దోరణి విస్తృతం కావడంతో 2025లో లీజింగ్ బలంగా కొనసాగొచ్చని అంచనా వేసింది. చైనా ప్లస్ వన్ విధానంతో భారత్ సైతం ప్రయోజనం పొందుతుండడం ఈ రంగాల్లో డిమాండ్‌కు కలిసొస్తున్నట్టు వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment