
హ్యుందాయ్ ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ కార్ ఐయోనిక్ (Ioniq 6) న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఆటో షోలో 2023 వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. దీంతో పాటు వరల్డ్ ఎలక్ట్రిక్ వెహికల్ అలాగే వరల్డ్ కార్ డిజైన్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను కూడా అందుకుని సత్తా చాటింది.
హ్యుందాయ్ మోటార్ కంపెనీకి ఇది ఒక విజయవంతమైన క్షణం. ఎందుకంటే ఐయోనిక్6 కంటే ముందు వచ్చిన ఐయోనిక్ 5 కార్‌కు గతేడాది మూడు అవార్డులూ వచ్చాయి. మరో ఆనందకరమైన విషయం ఏంటంటే హ్యుందాయ్ అండ్ జెనెసిస్ గ్లోబల్ డిజైన్ సెంటర్ అధినేత, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సాంగ్‌యుప్ లీ ఇటీవల 2023 వరల్డ్ కార్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యారు.
న్యూయార్క్ అంతర్జాతీయ ఆటో షోలో ఐయోనిక్6 తోపాటు మరికొన్ని ఇతర అసాధారణమైన వాహనాలు కూడా కొన్ని అవార్డులు అందుకున్నాయి. లూసిడ్ ఎయిర్ 2023 వరల్డ్ లగ్జరీ కార్ అవార్డును, కియా EV6 GT వరల్డ్ పెర్ఫార్మెన్స్ కార్ అవార్డును గెలుచుకున్నాయి. సిట్రోయెన్ C3 వరల్డ్ అర్బన్ కార్ అవార్డు విజేతగా నిలిచింది. భారతదేశంలో ఐయోనిక్6ను హ్యుందాయ్ ఇంకా పరిచయం చేయలేదు. అయితే ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ఈ కార్‌ను ప్రదర్శించింది.
వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల విజేతలను 32 దేశాల నుంచి 100 మంది ఆటోమోటివ్ జర్నలిస్టుల ప్యానెల్ ఎంపిక చేసింది. ఓవరాల్ వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు అర్హత పొందాలంటే వాటి ఉత్పత్తి పరిమాణం సంవత్సరానికి కనీసం 10,000 యూనిట్లు ఉండాలి. వాటి ధర ప్రాథమిక మార్కెట్‌లలో లగ్జరీ కార్ స్థాయి కంటే తక్కువ ఉండాలి. అలాగే కనీసం రెండు దేశాల్లో అమ్మకానికి అందుబాటులో ఉండాలి.