
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్‌తో కొన్ని రకాల ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందని ఐబీఎం ఛైర్మన్, సీఈవో అరవింద్ కృష్ణ (Arvind Krishna) అన్నారు. చాట్‌జీపీటీ (ChatGPT), గూగుల్ బార్డ్ (Google Bard) వంటి జెనరేటివ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ ఉత్పాదకతను పెంచగలవని, అయితే "బ్యాక్ ఆఫీస్, వైట్ కాలర్" ఉద్యోగాలపై వాటి ప్రభావం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
సీఎన్‌బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అరవింద్ కృష్ణ మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాలలో జనాభా పెరుగుదల క్షీణతను ప్రస్తావించారు. ఏఐ టెక్నాలజీలు మానవులకు నాణ్యమైన జీవనాన్ని అందించడంతో తోడ్పడగలవని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్టిఫీషియల్ సానుకూలతను ఉపయోగించుకోవడానికి ఐబీఎం కూడా ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ క్రమంలోనే ఐబీఎం ఇటీవల వాట్సన్‌ఎక్స్‌ను అనే జనరేటివ్ ఏఐ ప్లాట్‌ఫామ్ సూట్‌ను పరిచయం చేసింది. సాంకేతికతను సురక్షితంగా ఉపయోగించుకోవడంలో కంపెనీలకు సహాయం చేయడానికి దీన్ని రూపొందించారు.
ఇంతకు ముందు మేనెలలో జరిగిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలోనూ ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తమ కంపెనీలో 30 శాతం ఉద్యోగాలను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఆటోమేషన్ టెక్నాలజీతో భర్తీ చేసే అవకాశం ఉందని చెప్పారు. ఫలితంగా, వచ్చే ఐదేళ్లలో కంపెనీ 7,800 ఉద్యోగాలను తొలగిస్తుందని అంతా ఆందోళన చెందారు. తర్వాత తన వ్యాఖ్యలపై మరింత స్పష్టతనిస్తూ, కొత్త టెక్నాలజీ ఆఫీసు పనిని భర్తీ చేస్తుందని, ఐబీఎంలో కూడా ఇదే జరుగుతుందని పేర్కొన్నారు.