Automobile Industry Growth Rises in India, Demand in Rural Market - Sakshi
Sakshi News home page

గ్రామీణ ప్రాంతాల్లో ఆ కారుకు ఉన్న క్రేజ్‌ వేరబ్బా.. మూడు నెలల్లో రికార్డు సేల్స్‌!

Dec 17 2022 8:42 AM | Updated on Dec 17 2022 9:06 AM

India: Automobile Industry Growth Rises, Vehicles Got Demand In Rural Market - Sakshi

న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో వాహన మార్కెట్‌ గాడిన పడుతోంది. ద్విచక్ర వాహనాలు, చిన్న కార్లు, ట్రాక్టర్ల విక్రయాలు ఇటీవలి నెలల్లో పుంజుకోవడంతో ఆటోమొబైల్‌ కంపెనీల్లో భవిష్యత్‌ డిమాండ్‌ పట్ల ఆశలు చిగురిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగ సెంటిమెంట్‌ మెరుగుపడిన దానికి ఇది నిదర్శనం. ద్విచక్ర వాహనాలు, కార్లకు గ్రామీణ మార్కెట్‌ కీలకంగా ఉండడం గమనార్హం.

కరోనాతో ఏర్పడిన పరిస్థితులతో గ్రామీణ మార్కెట్‌లో డిమాండ్‌ తగ్గడం తెలిసిందే. ఆ డిమాండ్‌ ఇంకా బలంగా పుంజుకోలేదు. ఇప్పుడు సెంటిమెంట్‌లో మార్పు కనిపిస్తుండడం ఆశావహం.

గత రెండు నెలలుగా దేశవ్యాప్తంగా ద్విచక్ర వాహన విక్రయాలు రెండంకెల స్థాయిలో పెరిగాయి. ఈ విక్రయాల్లో గ్రామీణ మార్కెట్ల పాత్ర బలంగా ఉండడం గమనించాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్‌–జూన్‌) తర్వాత తిరిగి గత నెలలోనే ట్రాక్టర్ల విక్రయాలు సానుకూలంగా నమోదయ్యాయి. 

ఆల్టో కారుకు డిమాండ్‌  
గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా అమ్ముడుపోయే చిన్న కారు మారుతి ఆల్టో.. గత మూడు నెలల కాలంలో(సెప్టెంబర్‌–నవంబర్‌) రికార్డు స్థాయి విక్రయాలను నమోదు చేసింది. అమ్మకాలు 42.5 శాతం పెరిగి 61,767 యూనిట్లుగా ఉన్నాయి. ఆల్టో కే10 పేరుతో నవీకరించిన మోడల్‌ను మారుతి సుజుకీ ఇండియా ఈ ఏడాది ఆగస్ట్‌లో మార్కెట్‌కు పరిచయం చేసింది. విక్రయాల్లో దీని పాత్ర కూడా బలంగానే ఉందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

గ్రామీణ ప్రాంతాల్లో విక్రయ ధోరణలను పరిశీలిస్తే డిమాండ్‌ మెరుగుపడుతున్నట్టు తెలుస్తోందని మారుతీ సుజుకీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (మార్కెటింగ్, సేల్స్‌) శశాంక్‌ శ్రీవాస్తవ అన్నారు.

‘‘గత నెల విక్రయాలు కొంత నిదానించడాన్ని చూశాం. గ్రామీణ డిమాండ్‌ ఎప్పుడూ సీజనల్‌గా ఉంటుంది. వర్షాలు గత మూడు నాలుగేళ్లుగా మెరుగ్గా ఉన్నాయి. రిజర్వాయర్లలో నీటి నిల్వలు ఆరోగ్యకరంగా ఉన్నాయి. రబీ సాగు కూడా వేగంగానే ఉంది. సాగు తర్వాత వచ్చే నెల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ బలంగా ఉంటుందని అంచనా వేస్తున్నాం’’అని శ్రీవాస్తవ వివరించా రు. మారుతీ సుజుకీ వాహన విక్రయాల్లో గ్రామీణ ప్రాంత వాట గత ఆర్థిక సంవత్సరంలో 43.3 శాతంగా ఉంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు అది 43.8 శాతానికి పుంజుకుంది.
 

టూ వీలర్లదీ అదే దారి.. 
ద్విచక్ర వాహన విక్రయాల మార్కెట్‌ కూడా పుంజుకుంటోంది. గత త్రైమాసికంలో విక్రయాల్లో ఒక అంకె వృద్ధి నమోదు కాగా, రానున్న రోజుల్లో విక్రయాలు మరింత పెరుగుతాయనే అంచనాలు నెలకొన్నాయి. అక్టోబర్‌లో విక్రయాలు 41 శాతం పెరిగితే, నవంబర్‌లో 24 శాతం వృద్ధి ఉన్నట్టు ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ (ఫాడా) డేటా తెలియజేస్తోంది.దేశంలో ద్విచక్ర వాహనాల విక్రయాల్లో మొదటి స్థానంలో ఉన్న హీరో మోటో కార్ప్‌.. సానుకూల వినియోగ సెంటిమెంట్, ఆర్థిక కార్యకలాపాల మద్దతుతో రానున్న త్రైమాసికంలో విక్రయాలు పెరుగుతాయన్న అంచనాలను వ్యక్తం చేసింది. సాగు బలంగా ఉండడం, వివాహాల సీజన్‌ను ఉదాహరణలుగా పేర్కొంది.  

ఎఫ్‌ఎంసీజీకి అనుకూలం.. 
గ్రామీణ ప్రాంతాల్లో సన్నగిల్లిన ఎఫ్‌ఎంసీజీ డిమాండ్‌.. కొత్త సంవత్సరం ఆరంభం నుంచి మెరుగుపడుతుందని కంపెనీలు భావిస్తున్నాయి. పెరిగిపోయిన ద్రవ్యోల్బణం ప్రభావంతో గత నాలుగు త్రైమాసికాలుగా గ్రామీణ ప్రాంతాల్లో ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులకు డిమాండ్‌ తగ్గింది. ఇప్పుడు ద్రవ్యోల్బణం దిగొస్తుండడం, మరోవైపు బలమైన సాగు, పంటల మద్దతు ధరలతో డిమాండ్‌ ఇక మీదట బలపడుతుందని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో వచ్చే త్రైమాసికంలో డిమాండ్‌ స్థిరంగా ఉంటుందని భావిస్తున్నాయి.

చదవండి: భారత్‌లో అత్యంత ఖరీదైన కారు కొన్న హైదరాబాద్‌ వాసి.. వామ్మో అన్ని కోట్లా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement