ముంబై: విదేశీ ఇనిస్టిట్యూషన్స్ భారత స్టాక్స్‌లో పెట్టుబడులను గత ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా తగ్గించుకున్నాయి. 2020–21లో 23 బిలియన్ డాలర్లు (రూ.1.72 లక్షల కోట్లు) ఇన్వెస్ట్ చేయగా.. 2021–22లో కేవలం 3.7 బిలియన్ డాలర్లు (రూ.27,750 కోట్లు) పెట్టుబడులకే పరిమితమయ్యాయి. దీంతో ఎన్‌ఎస్‌ఈ 500 కంపెనీల్లో వాటి మొత్తం మొత్తం వాటాలు 19.9 శాతానికి, 582 బిలియన్ డాలర్ల విలువకు (రూ.43.65 లక్షల కోట్లు) పరిమితమయ్యాయి.
ఈ వివరాలను బ్యాంకు ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ ఓ నివేదిక రూపంలో వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ వారం ఆరంభం వరకు చూస్తే విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) పెట్టుబడుల ఉపసంహరణ 14.6 బిలియన్ డాలర్లకు చేరింది. ఇందులో మార్చి నెలలోనే 5.4 బిలియన్ డాలర్లు బయటకు వెళ్లిపోవడం గమనార్హం. ఫిబ్రవరిలో 4.7 బిలియన్ డాలర్లను ఉపసంహరించుకున్నారు.
మరింత వివరంగా..
► 2022 మార్చి 15 నాటికి ఎఫ్‌పీఐల హోల్డింగ్స్ విలువ 582 బిలియన్ డాలర్లుగా ఉంది. 2021 సెప్టెంబర్లో ఇది 667 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనించాలి.
► ఐటీ రంగంలో ఎఫ్‌పీఐల వాటాలు 0.87 శాతం పెరిగి 15 శాతానికి, ఇంధన రంగ కంపెనీల్లో 0.44 శాతం పెరిగి 15.5 శాతానికి, హెల్త్‌కేర్ రంగంలో 0.22 శాతం పెరిగి 4.9 శాతానికి చేరాయి.
► ఫైనాన్షియల్ కంపెనీల్లో ఎఫ్‌ఫీఐల పెట్టుబడులు 1.07 శాతం తగ్గి 31.5 శాతానికి పరిమితం అయ్యాయి. డిస్క్రీషనరీ కంపెనీల్లో 0.49 శాతం తగ్గి 9.1 శాతం మేర ఉన్నాయి.
► దేశీ ఇనిస్టిట్యూషన్స్ ఎన్‌ఎస్‌ఈ కంపెనీల్లో 2022 ఫిబ్రవరి నాటికి 265 బిలియన్ డాలర్ల పెట్టుబడులు కలిగి ఉన్నాయి. 13.1 బిలియన్ డాలర్లను తాజాగా కేటాయించాయి.
► ఎఫ్‌పీఐల వాటాల విలువ 2021–22 మొదటి త్రైమాసికం నాటికి 667 బిలియన్ డాలర్లుగా ఉంటే, అక్కడి నుంచి 112 బిలియన్ డాలర్ల మేర తగ్గాయి.
► దేశీ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు చురుగ్గా పెట్టుబడులు పెడుతుండడం వల్లే మార్కెట్లు మరీ పతనాన్ని చూడలేదని బ్యాంకు ఆప్ అమెరికా సెక్యూరిటీస్ పేర్కొంది.
► 2022 మార్చిలో ఎఫ్‌పీఐలు భారత ఈక్విటీల నుంచి 5.4 బిలియన్ డాలర్లను వెనక్కి తీసుకున్నారు. వరుసగా ఆరో నెలలోనూ వారు పెట్టుబడుల ఉపసంహరణను కొనసాగించారు. దీంతో మొత్తం మీద ఆరు నెలల్లో 14.6 బిలియన్ డాలర్లు వెనక్కి తీసుకెళ్లిపోయారు.
► దేశీ లిస్టెడ్ కంపెనీల్లో ఎఫ్‌పీఐల వాటాలు 2020 డిసెంబర్‌లో 21.4 శాతం స్థాయిలో ఉన్నాయి. అక్కడి నుంచి 19.9 శాతానికి దిగొచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment