ప్రస్తుత వేసవి సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని విమానయాన సంస్థలు భారీ స్థాయిలో సర్వీసులు అందించడానికి సిద్ధమయ్యాయి. మార్చి 31 నుంచి అక్టోబర్ 26 వరకు 2024 ఏడాదికిగాను సమ్మర్ షెడ్యూల్‌ను ప్రకటించాయి. దేశీయంగా ఈ నెల 31 నుంచి వారానికి 24,275 చొప్పున విమాన సర్వీసులు నడపనున్నట్లు ప్రకటించాయి. గతంతో పోలిస్తే ఇది 6 శాతం అధికమని ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ వెల్లడించింది.
ఇండిగో, ఎయిరిండియా, విస్తారాలు అత్యధికంగా విమాన సర్వీసులు నడపనుండగా..స్పైస్‌జెట్ మాత్రం తన సర్వీసుల సంఖ్యను తగ్గించుకుంటుంది. ఈ సమ్మర్ సీజన్‌లో దేశీయ విమానయాన సంస్థలు అమెరికాతోపాటు బ్రిటన్, ఉజ్బెకిస్తాన్, మాల్దీవ్స్, జార్జియా.. వంటి ఇతర దేశాలకు విమాన సర్వీసులు నడపనున్నట్లు తెలిపాయి.
దేశంలోని 27 విమానాశ్రయాల నుంచి అంతర్జాతీయ రూట్‌లో విమాన సేవలు అందుబాటులో ఉంటాయి. వారానికి 1,922 అంతర్జాతీయ సర్వీసులు ప్రయాణికులకు సేవలందిస్తాయి. అందులో భాగంగా ఈ నెల 28 నుంచే ఆకాశ ఎయిర్ అంతర్జాతీయ రూట్‌లో విమాన సేవలు ప్రారంభించనుంది.
ఇండిగో ఈ సీజన్‌లో 13,050 విమాన సర్వీసులను నడపబోతున్నట్లు తెలిపింది. ఎయిరిండియా 2,278, విస్తారా 2,324, ఆకాశ ఎయిర్ 903 సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. అంతర్జాతీయ రూట్‌లో ఎయిరిండియా 455 విమానాలు నడపనుండగా, ఇండిగో 731, విస్తారా 184కి పెంచుకుంటున్నాయి. ఇదిలా ఉండగా, స్పైస్‌జెట్ మాత్రం తన సర్వీసులను 1,657కి కుదించింది. ఈ సీజన్ నుంచి కొత్తగా అజామ్‌గఢ్, అలిగఢ్, చిత్రకూట్, గోండియా, జలగాన్, మోరదాబాద్, పిథోర్‌గర్ విమానాశ్రయాలు అందుబాటులోకి రానున్నట్లు తెలిసింది.
ఇదీ చదవండి: ఉద్యోగులను తొలగించనున్న ప్రపంచ నం1 కంపెనీ.. కారణం..
Comments
Please login to add a commentAdd a comment