హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వజ్రాల పరిశ్రమ ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15–20 శాతం తగ్గుతుందని క్రిసిల్ రేటింగ్స్ వెల్లడించింది. ‘డిమాండ్ పడిపోవడం, ముడి వజ్రాల ధర అంతర్జాతీయంగా పెరుగుతుండడమే ఇందుకు కారణం. 2022–23లో పరిశ్రమ ఆదాయం రూ.1,52,000–1,60,000 కోట్లు నమోదు కావొచ్చు. సహజ వజ్రాలకు కొరత, అంతకంతకూ ఇవి ప్రియం కావడంతో వినియోగదార్లు 50–60 శాతం తక్కువ ధర కలిగిన కృత్రిమ వజ్రాల వైపు మళ్లుతున్నారు. మొత్తం పరిశ్రమలో కృత్రిమ వజ్రాల వాటా రెండేళ్ల క్రితం 3 శాతం నమోదైంది.
ప్రస్తుతం ఇది ఏకంగా 8 శాతానికి చేరింది. 2021–22లో పరిశ్రమ అత్యధిక ఆదాయాన్ని ఆర్జించింది. గడిచిన దశాబ్ద కాలంలో ఇదే భారీ రికార్డ్. ఇక పాలిష్ చేసిన వజ్రాల ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో 48 శాతం, ముడి వజ్రాల దిగుమతులు 74 శాతం దూసుకెళ్లాయి. ముడి వజ్రాలకు అనుగుణంగా పాలిష్ చేసిన వజ్రాల ధరలు నిర్ణయిస్తారు. డిమాండ్ తక్కువగా ఉండడంతో పాలిష్ చేసిన వజ్రాల ధరలను పరిశ్రమ పెంచలేకపోయింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి ముడి వజ్రాల ధర దాదాపు 30 శాతం అధికమైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వజ్రాల పాలిషింగ్ కంపెనీల నిర్వహణ లాభదాయకత 75–100 బేసిస్ పాయింట్లు తగ్గి 4–4.25 శాతానికి చేరవచ్చు. ద్రవ్యోల్బణం, మరోవైపు యాత్రలు, ఆతిథ్యంలో కస్టమర్లు ఖర్చు చేస్తుండడంతో యూఎస్, యూరప్‌లో సమీప కాలంలో డిమాండ్ తగ్గుతుంది’ అని క్రిసిల్ వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment