సాక్షి, అమరావతి : దేశంలో ఢిల్లీ, మహారాష్ట్రల్లోని మున్సిపల్ కార్పొరేషన్ల మినహా మిగతా రాష్ట్రాల్లోని కార్పొరేషన్ల రెవెన్యూ రాబడి చాలా తక్కువగా ఉందని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నివేదిక వెల్లడించింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఒక శాతం కూడా మిగతా రాష్ట్రాల కార్పొరేషన్ల రెవెన్యూ రాబడిలేదని పేర్కొంది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ల రెవెన్యూ రాబడి ఆ రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 2.75 శాతం ఉండగా మహారాష్ట్రలోని మున్సిపల్ కార్పొరేషన్ల రెవెన్యూ రాబడి ఆ రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 2.12 శాతం ఉందని తెలిపింది. దేశంలోని వివిధ రాష్ట్రాల మున్సిపల్ కార్పొరేషన్ల మొత్తం రెవెన్యూ రాబడులు, అందులో కార్పొరేషన్ల సొంత రాబడులు, వ్యయాలకు సంబంధించి ఆర్‌బీఐ అధ్యయనం చేసి నివేదిక విడుదల చేసింది. ఇందులో పేర్కొన్న ముఖ్యాంశాలు ఏమిటంటే..
పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా పట్టణ ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడానికి కార్పొరేషన్లు సొంత రాబడులను పెంచుకోవడంతో పాటు వివిధ మార్గాల్లో నిధులను సమీకరించుకోవాలి.
దేశంలోని మున్సిపల్ కార్పొరేషన్ల సగటు ఆదాయాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో చాలా తక్కువ రాబడి ఉంది.
దేశ జీడీపీలో కార్పొరేషన్ల సగటు రాబడి 0.72 శాతం ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో అది రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 0.38 శాతమే ఉంది.
మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల్లో మున్సిపల్ కార్పొరేషన్ల మొత్తం రెవెన్యూ రాబడులు, సొంత రెవెన్యూ రాబడులు అత్యధికంగా ఉండగా మిగతా రాష్ట్రాల్లోని మున్సిపల్ కార్పొరేషన్ల మొత్తం రెవెన్యూ రాబడులు, సొంత రెవెన్యూ రాబడులు అత్యంత తక్కువగా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో 2018–19 ఆర్థిక ఏడాదిలో మున్సిపల్‌కార్పొరేషన్ల రెవెన్యూ రాబడులు ఎంత ఉన్నాయో 2019–20 ఆర్దిక ఏడాదిలో కూడా అంతే ఉన్నాయి.
ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల సొంత రెవెన్యూ రాబడులు 2018–19 ఆర్థిక ఏడాదిలో రూ.2,906.83 కోట్లు ఉండగా.. రెవెన్యూ వ్యయం రూ.2,692.52 కోట్లు ఉంది.
అదే 2019–20లో ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల సొంత రెవెన్యూ రాబడులు రూ.2,906.83 కోట్లు ఉండగా రెవెన్యూ వ్యయం రూ.2,954.08 కోట్లు ఉంది.
అలాగే, ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల ఉద్యోగుల వేతనాలు, భత్యాలు, పెన్షన్ల వ్యయం 2018–19లో రూ.822.49 కోట్లు కాగా.. 2019–20లో రూ.878.83 కోట్లకు పెరిగింది.
ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల ఆపరేషన్, నిర్వహణ వ్యయం 2018–19లో రూ.1,143.86 కోట్లు వ్యయం కాగా.. 2019–20లో రూ.1,254.16 కోట్లు.
ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్లలో అడ్మినిస్ట్రేటివ్ వ్యయం 2018–19లో రూ.238.59 కోట్లు కాగా.. 2019–20లో రూ.247.75 కోట్లకు పెరిగింది.
ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్లలో మూలధన వ్యయం 2018–19లో రూ.4,419.12 కోట్లు ఉండగా ఇది జీఎస్‌డీపీలో 0.51 శాతంగా ఉంది.
2019–20లో మూలధన వ్యయం రూ.5,788.75 కోట్లు ఉండగా ఇది జీఎస్‌డీపీలో 0.60 శాతంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment