చమురు కంపెనీల లాభాలు మూడు రెట్లు | Indian OMCs set to register 3x pre-tax profit of Rs 1 lk cr in FY24 | Sakshi
Sakshi News home page

చమురు కంపెనీల లాభాలు మూడు రెట్లు

Published Thu, Jul 27 2023 5:20 AM | Last Updated on Thu, Jul 27 2023 5:20 AM

Indian OMCs set to register 3x pre-tax profit of Rs 1 lk cr in FY24 - Sakshi

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చమురు మార్కెటింగ్‌ కంపెనీల (ఓఎంసీ) నిర్వహణ లాభాలు మూడు రెట్లు పెరగనున్నాయి. రూ. 1 లక్ష కోట్లకు చేరనున్నాయి. అంతర్జాతీయంగా క్రూడ్‌ రేట్లు తగ్గడం, దేశీయంగా రిటైల్‌ రేట్లు అధిక స్థాయిలో ఉండటం తదితర అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి. రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది.

దీని ప్రకారం.. 2017–2022 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో ఓఎంసీల నిర్వహణ లాభాలు సగటున రూ. 60,000 కోట్లుగా ఉండగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ. 33,000 కోట్లు నమోదు చేశాయి. ఈ నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి నిర్వహణ లాభాలు మూడు రెట్లు పెరిగే అవకాశం ఉందని మూడు ప్రభుత్వ రంగ ఓఎంసీల మీద నివేదికలో క్రిసిల్‌ పేర్కొంది. ఆయిల్‌ కంపెనీలకు ప్రధానంగా రిఫైనింగ్‌ (ముడి చమురును శుద్ధి చేయడం), రిటైల్‌ బంకుల ద్వారా ఇంధనాలను మార్కెటింగ్‌ చేయడం ద్వారా రెండు మార్గాల్లో ఆదాయం వస్తుంది.   

నివేదికలో మరిన్ని అంశాలు..
► రష్యా మీద ఆంక్షల నేపథ్యంలో ఇంధనాలకు డిమాండ్‌ పెరగడంతో 2023 ఆర్థిక సంవత్సరంలో స్థూల రిఫైనింగ్‌ మార్జిన్లు సగటున బ్యారెల్‌కు 15 డాలర్లు పలికాయి. అయితే, క్రూడాయిల్‌ రేట్లు పెరిగినప్పటికీ .. రిటైల్‌ ఇంధన ధరను ఆ స్థాయిలో పెంచకపోవడంతో, రిఫైనింగ్‌ మార్జిన్లు పటిష్టంగానే ఉన్నా.. మార్కెటింగ్‌పరంగా నష్టాలు నమోదు చేయాల్సి వచి్చంది. దీంతో గత ఆర్థిక సంవత్సరంలో లాభదాయకత బలహీనపడింది.  
► ఈసారి నిర్వహణ లాభాలు లీటరుకు రూ. 5–7 స్థాయికి చేరవచ్చని, స్థూల రిఫైనింగ్‌ మార్జిన్లు బ్యారెల్‌కు 6–8 డాలర్ల స్థాయికి పరిమితం కావచ్చని నివేదిక పేర్కొంది.
► 2017–23 మధ్య కాలంలో ఆయిల్‌ కంపెనీలు తమ రిఫైనింగ్, మార్కెటింగ్‌ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చుకునేందుకు రూ. 3.3 లక్షల కోట్లు వెచి్చంచాయి. ఫలితంగా 2017లో రూ. 1.2 లక్షల కోట్లుగా ఉన్న వాటి స్థూల రుణ భారం 2023 ఆర్థిక సంవత్సరానికి రూ. 2.6 లక్షల కోట్లకు చేరింది. అయితే, లాభదాయకత తక్కువ స్థాయిలోనే కొనసాగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఓఎంసీల పెట్టుబడి వ్యయాలు రూ. 54,000 కోట్ల మేర ఉంటాయని అంచనా.  
► ఈసారి క్రూడాయిల్‌ రేట్లు ఊహించిన దానికన్నా ఎక్కువగా పెరిగినా లేక ముడిచమురు ధర తగ్గకుండా రిటైల్‌ రేట్లు తగ్గినా అంచనాలు మారిపోవచ్చు.  

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement