
సాక్షి, విశాఖపట్నం : ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ విశాఖలో ఏర్పాటుకు ఒక్కో అడుగు ముందుకు పడుతోంది. నగరంలో ఇన్ఫోసిస్ సంస్థకు కావలసిన సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అందిస్తోంది. మరో రెండు నెలల్లో విశాఖలో ఇన్ఫోసిస్ కొత్త క్యాంపస్ కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉండడంతో అందుకు అవసరమైన చర్యలు మొదలయ్యాయి. ఒక పక్క ఇన్ఫోసిస్, మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా పనులు వేగవంతం చేస్తున్నాయి.
విశాఖలో ఇన్ఫోసిస్ సంస్థ ఏర్పాటు ప్రకటన వెలువడిన తరువాత నుంచి నగరంలో సరైన స్థలం కోసం అన్వేషణ జరుగుతోంది. నగరంలో కొన్ని ప్రాంతాలను పరిశీలించినా అవి అనుకూలంగా ఉండవన్న నిర్ధారణకు వచ్చారు. దీంతో ప్రాథమికంగా ప్లగ్ అండ్ ప్లే విధానంలో సంస్థ కార్యకలపాలు మొదలు పెట్టడానికి వీలుగా రుషికొండ సమీపంలోని ఐటీ హిల్స్‌లో ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
లక్ష చదరపు అడుగుల (ఎస్‌ఎఫ్‌టీ) విస్తీర్ణం ఉన్న భవనాన్ని అద్దె ప్రాతిపదికన తీసుకుని కార్యకలాపాలు ప్రారంభిస్తారు. భవిష్యత్తులో ఇన్ఫోసిస్ సొంత భవనం సమకూర్చుకునే వరకు అక్కడే నడుపుతారు. ఈ విషయాన్ని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ‘సాక్షి’తో చెప్పారు. ఆరంభంలో వెయ్యి మంది ఉద్యోగులతో ఇన్ఫోసిస్ విశాఖ యూనిట్‌లో కార్యకలాపాలు ప్రారంభించనుంది. మున్ముందు ఆ సంఖ్యను దశల వారీగా 2,500 నుంచి 3,000 మంది వరకు పెంచనుంది.
త్వరలో హెచ్‌సీఎల్ కూడా..
మరోవైపు ఇన్ఫోసిస్‌తో పాటు మరో ప్రముఖ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్ కూడా విశాఖపట్నంలో తమ యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. టైర్–2 నగరాల్లో విశాఖపట్నం ప్రథమ స్థానంలో ఉండడంతో ఇంకా మరికొన్ని ఐటీ సంస్థలు విశాఖలో తమ యూనిట్ల ఏర్పాటుపై ఆసక్తి కనబరుస్తున్నాయి. దీంతో భవిష్యత్తులో బహుళ జాతి ఐటీ సంస్థలు విశాఖలో అడుగు పెట్టేందుకు మార్గం సుగమం అవుతోంది.
ఇప్పటికే మరో ప్రఖ్యాత సంస్థ అదానీ.. మధురవాడ సమీపంలో 130 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ పార్కును ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం రూ.14,634 కోట్లు వెచ్చిస్తోంది. కాగా విశాఖలో ప్రస్తుతం ఐటీ, ఐటీఈఎస్ సంస్థలు 150 వరకు నడుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ, ఐటీ రంగానికున్న అనుకూలతల నేపథ్యంలో రానున్న రోజుల్లో విశాఖలో మరిన్ని ఐటీ సంస్థలు ఏర్పాటుకు ముందుకొస్తాయని, ఫలితంగా విరివిగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఆ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. (క్లిక్: మేడిన్ ఇండియా కాదు.. మేక్ ఫర్ వరల్డ్)
Comments
Please login to add a commentAdd a comment